Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు.. భారతీయులకు అలర్ట్
బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగాల్లో కోటా విషయంలో ఆందోళనదారులకు, అధికార పార్టీ మద్దతుదారులకు ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో సూమారుగా 32 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. చాలామందికి గాయాలైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గతంలో ఇదే అంశంపై జరిగిన అల్లర్లలో దాదాపు 200 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఘర్షణల కారణంగా ఆ దేశ వ్యాప్తంగా నేటి సాయంత్రం నుంచి నిరవధిక కర్ఫ్యూ విధించాలని బంగ్లా హోంశాఖ పేర్కొంది.
భారతీయ పౌరులకు రాయబార కార్యాలయం హెచ్చరిక
ఈ నేపథ్యంలో అక్కడ భారతీయ పౌరులకు మన రాయబార కార్యాలయం అప్రమత్తం చేసింది. దేశంలో ఉన్న విద్యార్థులు సహా భారతీయ పౌరులు తమతో టచ్‌లో ఉండాలని సిల్హట్‌లోని అసిస్టెంట్ హైకమిషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అదే విధంగా స్థానిక కార్యాలయ ఫోన్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచింది. విధ్వంసానికి పాల్పడేవారు విద్యార్థులు కారని, ఉగ్రవాదులని ప్రధానమంత్రి షేక్ హసీనా వెల్లడించారు.