Iran: నస్రల్లా హత్యతో ఉద్రిక్తత.. ఇరాన్ భద్రతా మండలి కీలక సమావేశం
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. హెజ్‌బొల్లా సంస్థ ఈ ఘటనకు ప్రతీకార చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఇరాన్ ఇప్పటికే హెజ్‌బొల్లాకు మద్దతు ప్రకటించడంతో భద్రతా మండలి తీసుకునే నిర్ణయాలు ఆసక్తిగా మారాయి. యెమెన్, లెబనాన్, సిరియా దేశాలు కూడా ఇజ్రాయెల్‌పై ప్రతీకార చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, లెబనాన్ ప్రజలకు, హెజ్‌బొల్లాకు మద్దతుగా ఉంటామని చెప్పారు.
నస్రల్లా హత్యతో సిరియాలో సంబరాలు
ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనేందుకు సాయం కావాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. హసన్ నస్రల్లా హత్య అనంతరం ఖమేనీని సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ, టెహ్రాన్‌లో వేలాది మంది ఇరానియన్లు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉండగా నస్రల్లా హత్యకు సంబంధించిన వార్తలు వెలువడిన తర్వాత సిరియాలో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఇక లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 33 మంది మృతి చెందగా, 195 మందికి పైగా గాయాలపాలయ్యారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత రెండు వారాల్లో జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో 1,000 మందికి పైగా మరణించారని, 6,000 మందికి పైగా గాయాలపాలయ్యారని తెలిపారు.