Pakistan: కరాచీ విమానాశ్రయంలో చైనా పౌరులపై ఉగ్రవాద దాడి.. ఇద్దరు మరణం
పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో ఆదివారం రాత్రి జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు చైనా పౌరులు సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో 17 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను జిన్నా ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాద సంస్థ బలూచిస్తాన్ నేషనల్ ఆర్మీ ఈ పేలుడుకు బాధ్యత వహించినట్లు ప్రకటించింది. పాకిస్తాన్‌లోని చైనా రాయబార కార్యాలయం కూడా ఈ ఘటనను ధృవీకరించింది. ఈ దాడి ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో జరిగింది. పోర్ట్ ఖాసిం ఎలక్ట్రిక్ పవర్ కంపెనీకి చెందిన కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు.
ఖండించిన చైనా
పేలుడు సంభవించిన తర్వాత, మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. దీంతో అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనను ఖండిస్తూ, చైనా ఎంబసీ ప్రగాఢ సానుభూతిని తెలిపింది. గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని పాకిస్తాన్‌ను కోరింది. చైనా రాయబార కార్యాలయం, పాకిస్తాన్‌లోని చైనా పౌరులు, సంస్థల భద్రతకు సంబంధించి కఠినమైన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. పాకిస్తాన్‌లోని చైనా సంస్థలు భద్రతపై శ్రద్ధ వహించాలని, స్థానిక పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి బాధ్యత వహించింది
ఘటనపై ధ్రువీకరించిన పాకిస్థాన్
అయితే పాకిస్తాన్ అధికారులు దీనిని ఇంకా ధ్రువీకరించలేదు. విమానయాన శాఖలో పనిచేస్తున్న రాహత్ హుస్సేన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడి ఎయిర్ పోర్ట్ భవనాలను కంపించే స్థాయిలో జరిగింది. ఉత్తర నజీమాబాద్, కరీమాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ పేలుడు శబ్దం వినిపించడంతో స్థానిక అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రాథమికంగా ఈ దాడి చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిగింది, ఎందుకంటే ఆ ప్రాంతంలో వేలాది చైనా కార్మికులు పనిచేస్తున్నారు.