Bangladesh: షేక్ హసీనాకు బంగ్లాదేశ్ తీవ్ర హెచ్చరిక.. బేడీలతోనే తీసుకొస్తాం!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చేందుకు ప్రత్యేక విమానం పంపించాలంటూ మాజీ ప్రధాని షేక్ హసీనా చేసిన విజ్ఞప్తిపై ఢాకా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆమెను సాధారణ ప్రయాణికురాలిగా స్వదేశానికి తీసుకురావడం సాధ్యం కాదని, చేతులకు, కాళ్లకు బేడీలు వేసి, కట్టుదిట్టమైన భద్రత మధ్య ఖైదీగా మాత్రమే తీసుకొస్తామని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ హెచ్చరించారు. డిసెంబర్ 16న నిర్వహించే విజయ్ దివస్ సందర్భంగా ఢిల్లీ నుంచి బంగ్లాదేశ్ బిమాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రత్యేక విమానాన్ని పంపించాలని హసీనా కోరినట్లు వచ్చిన వార్తలపై అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ ఎండీ అమీనుల్ ఇస్లాం తీవ్రంగా స్పందించారు.
వివరాలు
నేరగాళ్ల అప్పగింత ఒప్పందం ప్రకారమే రాక
హసీనా చేసిన విజ్ఞప్తిని పిచ్చితనంగా అభివర్ణించారు. ఉరిశిక్ష పడిన నేరస్థురాలి కోసం ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని పంపించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని వ్యాఖ్యానించారు.
హసీనా కోరికలు వేరని, వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయని హుమాయున్ కబీర్ స్పష్టం చేశారు.
ఢాకాలో విదేశీ దౌత్యవేత్తలతో జరిగిన సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. షేక్ హసీనా ఒక పరారీలో ఉన్న తీవ్రవాది అని ఆరోపించారు.
ఇరు దేశాల మధ్య అమల్లో ఉన్న నేరగాళ్ల అప్పగింత ఒప్పందం ప్రకారమే ఆమెను బంగ్లాదేశ్‌కు తీసుకురావడం సాధ్యమవుతుందని తేల్చిచెప్పారు.
వివరాలు
భారత్‌తోనే అప్పగింతపై చర్చలు
బంగ్లాదేశ్ ప్రధాని సమాచార సలహాదారు జాహెద్ ఉర్ రెహమాన్ కూడా హసీనా స్వదేశానికి తిరిగి వచ్చే అంశంపై స్పందించారు.
ఈ విషయంలో చర్చలు హసీనాతో కాకుండా భారత ప్రభుత్వంతోనే జరుగుతాయని స్పష్టం చేశారు. ఆమె విమానంలో వస్తారా? కాలినడకన వస్తారా? అన్నది తమకు ముఖ్యం కాదన్నారు.
తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తిని ఏ విధంగా అప్పగించాలన్న అంశంపైనే భారత్‌తో సంప్రదింపులు జరుపుతామని వెల్లడించారు.
హసీనా స్వయంగా బంగ్లాదేశ్‌కు రావాలని కోరుకుంటున్నందున ఆమె అప్పగింతకు న్యాయపరమైన అడ్డంకులేవీ ఉండబోవని పేర్కొన్నారు.
వివరాలు
బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు
మరోవైపు షేక్ హసీనా తిరిగి వస్తారన్న ప్రకటనతో బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న బాంబు దాడులు, హింసాత్మక ఘటనల వెనుక నిషేధిత అవామీ లీగ్‌కు చెందిన శక్తులు ఉన్నాయని అక్కడి ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఈ పరిణామాలకు సంబంధించిన వివరాలను భారత్, అమెరికా, బ్రిటన్, చైనాతో పాటు దాదాపు 60 దేశాల దౌత్యవేత్తలకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ వివరించింది.
వివరాలు
బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు
ఇదిలా ఉండగా, ఎన్‌సీపీ నేత నహీద్ ఇస్లాం బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్‌తో సమావేశమయ్యారు.
భారత్‌కు వ్యతిరేకంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
హసీనా వంటి హంతకురాలికి ఆశ్రయం కల్పిస్తున్నందుకు నిరసనగా భారత ఆధిపత్యాన్ని ప్రతిఘటించాలని ఆయన వ్యాఖ్యానించారు.
దీంతో హసీనా అప్పగింత అంశం భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన వివాదంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.