Page Loader
Telsa: అమెరికాలో మరోసారి టెస్లా షోరూమ్‌పై దాడి
అమెరికాలో మరోసారి టెస్లా షోరూమ్‌పై దాడి

Telsa: అమెరికాలో మరోసారి టెస్లా షోరూమ్‌పై దాడి

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2025
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని ఒరెగాన్‌లో మరోసారి టెస్లా షోరూంపై దాడి కలకలం సృష్టించింది. గురువారం కొందరు దుండగులు షోరూంపై కాల్పులు జరిపారు. దాదాపు 12 రౌండ్ల వరకు గన్‌ఫైరింగ్ చేయడంతో షోరూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి, పలు వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ఎవరికీ ప్రాణహాని కలగలేదు. వారం వ్యవధిలో ఇదే షోరూమ్‌పై ఇది రెండోసారి దాడి జరగడం గమనార్హం. ఈ ఘటనపై FBI సహా ఇతర దర్యాప్తు సంస్థలు సమన్వయంతో పనిచేస్తామని పోలీసులు తెలిపారు.

Details

ఎలాన్ మస్క్‌పై వ్యతిరేకత

డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలో ఎలాన్ మస్క్‌ కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) చీఫ్‌ హోదాలో ఫెడరల్ ఉద్యోగుల తొలింపులు చేపట్టడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన సీఈఓగా ఉన్న టెస్లా కంపెనీ వరుస దాడులకు గురవుతోంది.

Details

అమెరికా వ్యాప్తంగా టెస్లాపై వరుస దాడులు 

మార్చి 6న ఒరెగాన్‌లోని టెస్లా షోరూమ్‌పై దాడిలో పలు ఈవీ వాహనాలు ధ్వంసం అయ్యాయి. కొలరాడో లవ్‌ల్యాండ్‌లో ఓ మహిళ షోరూమ్‌ను ధ్వంసం చేసి మస్క్‌ వ్యతిరేక రాతలు రాసింది. బోస్టన్‌లో టెస్లా ఛార్జింగ్ స్టేషన్‌ను దుండగులు తగలబెట్టారు. సియాటెల్‌లో టెస్లా వాహనాలకు నిప్పుపెట్టారు. వాషింగ్టన్ లీన్‌వుడ్‌లో టెస్లా సైబర్‌ ట్రక్కులపై స్వస్తిక్ గుర్తులు, మస్క్ వ్యతిరేక నినాదాలు కనిపించాయి. స్పందించిన ట్రంప్ టెస్లాపై జరుగుతున్న దాడులను దేశీయ ఉగ్రవాదంగా డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. ఈ ఘటనలపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి చర్యలు ఓ గొప్ప కంపెనీకి తీరని నష్టం కలిగిస్తాయని, అమెరికా ఆర్థిక వ్యవస్థకు టెస్లా వంటి కంపెనీలు అందిస్తున్న సేవలను మరిచిపోకూడదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.