
Thailand-Cambodia: థాయ్-కంబోడియా మధ్య కాల్పుల విరమణ.. ప్రకటించిన మలేషియా ప్రధాని
ఈ వార్తాకథనం ఏంటి
ఆగ్నేయాసియా ప్రాంతాన్ని కొన్ని రోజులుగా వేధిస్తున్న యుద్ధ వాతావరణం చివరకు శాంతి దిశగా మారింది. సరిహద్దు వివాదంతో తీవ్ర ఉద్రిక్తతలకు లోనైన థాయిలాండ్-కంబోడియా దేశాలు ఇకపై ఎలాంటి షరతులు లేకుండానే తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం సోమవారం అధికారికంగా ప్రకటించారు. అత్యంత ఉద్రిక్తంగా మారిన ఈ పరిస్థితి నేపథ్యంలో, గత కొన్ని రోజులుగా సరిహద్దు వద్ద జరిగుతున్న కాల్పుల నేపథ్యంలో చర్చల అవసరం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించిన ప్రకారం, రెండు దేశాలు శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి. చర్చల కోసం సోమవారం మలేసియాలో సమావేశం కావాలని రెండు దేశాలు నిర్ణయించుకోవడం వల్ల, ఈ సానుకూల పరిణామం ఉత్పన్నమైంది.
వివరాలు
మందుపాతర పేలి ఐదుగురు థాయ్ సైనికులకు గాయాలు
సరిహద్దు ప్రాంతంలో ఒక మందుపాతర పేలడంతో ఐదుగురు థాయ్ సైనికులు గాయపడిన ఘటన ఈ ఘర్షణకు మూలకారణమైంది. ఈ ఘటన తర్వాత పరస్పరం ఇరుదేశాల సైనికులు తేలికపాటి ఆయుధాలు, శతఘ్నులు, రాకెట్లు ఉపయోగించి దాడులకు పాల్పడ్డారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో, థాయ్‌లాండ్ తమ దేశంలో ఉన్న కంబోడియా రాయబారిని బహిష్కరించడంతో పాటు, తమ రాయబారిని కూడా వెనక్కి పిలిపించుకుంది. దాంతో పరిస్థితి మరింత ఉద్ధృతంగా మారింది. ఈ ఘర్షణల్లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు రెండులక్షల మంది తమ నివాసాలు వదిలి వెళ్లవలసి వచ్చింది.
వివరాలు
థాయ్‌లాండ్ - కంబోడియా ఘర్షణపై ట్రంప్
ఇక, నోబెల్ శాంతి బహుమతి అందుకోవాలని ఆశపడుతోన్న ట్రంప్ ఈ రెండుదేశాల మధ్యలోకి వచ్చారు. ఇప్పటికే పలు యుద్ధాలను ఆపినట్లు గర్వంగా చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా ఇప్పుడు ఆ జాబితాలోకి థాయ్‌లాండ్ - కంబోడియా ఘర్షణ కూడా చేరింది.