జి20 శిఖరాగ్ర సమావేశానికి జిన్‌పింగ్ గైర్హాజరు కావడంపై జో బైడెన్ నిరాశ
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ జీ20కి శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాకూడదని తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నిరాశ వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆదివారం డేలావేర్‌లో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు బైడెన్ స్పందిస్తూ.. ''నేను నిరుత్సాహనికి గురయ్యాను.. కానీ, నేను ఆయనను కలిసేందుకు వెళుతున్నాను'' అని తెలిపారు. సెప్టెంబర్ 7-10 మధ్యలో బైడెన్ జీ20 సదస్సు పర్యటనకు హాజరవుతారు. అనంతరం వియత్నాంలో పర్యటిస్తారు. ఈ రెండు పర్యటనలపై బైడెన్ స్పందిస్తూ.. భారత్ ,వియాత్నం దేశాలతో మరింత సమన్వయం చేసుకోవాల్సి ఉందన్నారు. అదే సమయంలో ఆయా దేశాలతో కూడా అమెరికాతో సంబంధాలను బలపర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు.
ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోపరేషన్ సదస్సులో బైడెన్-జిన్‌పింగ్ భేటీకి అవకాశం
అంతకముందు భారత్ వెళతానని జిన్‌పింగ్ వెల్లడించారు. కానీ, చైనా విదేశాంగ శాఖ నిర్వహించిన ప్రెస్‌మీట్ అనంతరం జిన్‌పింగ్ ఈ ఏడాది జీ20కి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ వారంలో జరగనున్న సదస్సుకు తన ప్రతినిధిగా చైనా ప్రీమియర్ లి కియాంగ్‌ను పంపాలని జిన్‌పింగ్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. చివరిసారిగా బైడెన్-జిన్‌పింగ్ గతేడాది బాలిలో జరిగిన సదస్సులో కలిశారు. ఈ ఏడాది నవంబర్‌లో శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోపరేషన్ సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సదస్సులో బైడెన్-జిన్‌పింగ్ భేటీ అయ్యే అవకాశాలున్నాయి.