
Turkey: తుర్కియే అధ్యక్షుడి కుమార్తె మాకు బాస్ కాదు.. సెలెబీ సంచలన ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాకిస్థాన్‌కు తుర్కియే మద్దతు ప్రకటించిన నేపథ్యంలో భారత్‌లో ఆ దేశంపై నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి.
తుర్కియేకి చెందిన వస్తువులు, సేవలను నిషేధించాలన్న డిమాండ్లు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి.
ఈ పరిణామాల మధ్య, భారతీయ విమానాశ్రయాల్లో సేవలందిస్తున్న తుర్కియే కంపెనీ 'సెలెబీ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్'కి కేంద్ర ప్రభుత్వం అనుమతులు రద్దు చేసింది.
ఈ నేపథ్యంలో సెలెబీ సంస్థ స్పందిస్తూ, తమది అసలు తుర్కియే కంపెనీ కాదని స్పష్టంచేసింది.
తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ కుమార్తె సమయ్యి తమ బాస్ అన్న ప్రచారంలో నిజం లేదని పేర్కొంది.
Details
ఎవరికి సంస్థలో వాటాలు లేవు
సమయ్యి పేరుతో తమ మాతృ సంస్థలో ఎవరికీ వాటాలు లేవని, సంస్థ యాజమాన్యం పూర్తిగా సెలెబియోగ్లు కుటుంబానికి చెందిందని స్పష్టం చేసింది.
వారు రాజకీయంగా ఏ సంబంధాలు లేకుండా పారదర్శకంగా ఏవియేషన్ సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది.
తమ మాతృ సంస్థలో ఉన్న 65 శాతం వాటాలు కెనడా, అమెరికా, యూకే, సింగపూర్, యూఏఈ, పశ్చిమ ఐరోపా దేశాలకు చెందిన సంస్థాగత మదుపరులవేనని సెలెబీ స్పష్టం చేసింది.
భారత్‌లో తమ సేవలు పౌరవిమానయాన భద్రతా మండలి (BCAS), సీఐఎస్‌ఎఫ్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరంతరం ఆడిట్‌కు లోనవుతాయని పేర్కొంది.
Details
సెలెబీ సంస్థకు అనుమతులు రద్దు
భారత భద్రతా, పన్ను, వైమానిక నిబంధనల్ని తాము కచ్చితంగా పాటిస్తున్నామని తెలిపింది. అయితే భద్రతాపరమైన కారణాలతో సెలెబీ సంస్థకు భారతదేశంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నట్లు 'బీసీఏఎస్'గురువారం ప్రకటించింది.
హైదరాబాద్, చెన్నై సహా తొమ్మిది విమానాశ్రయాల్లో సెలెబీ సేవలందిస్తోంది.
ఒప్పందాల రద్దు నేపథ్యంలో, సంబంధిత విమానాశ్రయాల్లో సరకు రవాణా, ప్రయాణికుల కదలికలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తయ్యాయని పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు.