Iran: ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాట్సప్, గూగుల్ ప్లేస్టోర్‌పై ఆంక్షలు ఎత్తివేత
ఇరాన్ ప్రభుత్వం ఆంక్షలను సడలిస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ వినియోగంపై కఠిన ఆంక్షలు అమలుచేస్తున్న ఈ దేశం, వాట్సాప్, గూగుల్ ప్లేస్టోర్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు ఇరాన్ ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి సత్తార్ హషేమీ ప్రకటించారు. సుప్రీంకోర్టు కౌన్సిల్, మంత్రిత్వ శాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో జరిపిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకోగలిగామని హషేమీ వెల్లడించారు. ఐకమత్యంతో, సహకారంతో ఈ తొలి అడుగు వేశామని, దీనిని నిజం చేసిన దేశాధ్యక్షుడు, మీడియా, హక్కుల కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన తన 'ఎక్స్' ఖాతాలో వెల్లడించారు.
గతంలో ఇంటర్నెట్ ఆంక్షలను ఎత్తివేస్తామని హామీ
ఇటీవలే, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కిన్ ఎన్నికల ప్రచారంలో ఇంటర్నెట్ ఆంక్షలను ఎత్తివేసే హామీ ఇచ్చారు. అయితే వాట్సప్, గూగుల్ ప్లేస్టోర్ వంటి అంతర్జాతీయ సేవలను పునరుద్ధరించినప్పటికీ, ఇరాన్ ప్రభుత్వం స్థానిక మాధ్యమాలు, సేవలపైనే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేసింది. ఈ మార్పులు స్థానిక వ్యాపారాల, వినియోగదారులపై ఎలా ప్రభావం చూపిస్తాయనే విషయం సుదీర్ఘంగా అంచనా వేసేందుకు కష్టతరంగా మారింది. ఈ ఆంక్షల సడలింపు, ఇరాన్‌లో ఇంటర్నెట్ స్వేచ్ఛకు ఓ కీలక ముందడుగు అని భావిస్తున్నారు.