Page Loader
Operation Bunyan Al Marsas : పాక్ దాడులకు 'ఆపరేషన్ బున్యాన్ అల్ మార్సస్' పేరు.. దీని అర్థం ఏమిటో తెలుసా? 
పాక్ దాడులకు 'ఆపరేషన్ బున్యాన్ అల్ మార్సస్' పేరు.. దీని అర్థం ఏమిటో తెలుసా?

Operation Bunyan Al Marsas : పాక్ దాడులకు 'ఆపరేషన్ బున్యాన్ అల్ మార్సస్' పేరు.. దీని అర్థం ఏమిటో తెలుసా? 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2025
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

శుక్రవారం అర్ధరాత్రి తర్వాత, శనివారం తెల్లవారుజాము వరకు పాకిస్థాన్ భారత్‌పై డ్రోన్లు, క్షిపణులతో తీవ్ర దాడులకు పాల్పడింది. అయితే వీటిలో చాలావరకు భారత దళాలు సమర్థవంతంగా అడ్డుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లోని ఫార్వర్డ్ పోస్ట్‌లకు దళాలను తరలిస్తూ పాక్ దాడుల తీవ్రతను మరింత పెంచింది.

Details

'ఆపరేషన్ బున్యాన్ అల్ మార్సస్' అంటే ఏమిటి?

పాకిస్థాన్ భారత్‌పై చేస్తున్న తాజా దాడులకు 'ఆపరేషన్ బున్యాన్ అల్ మార్సస్' అనే కోడ్ నేమ్ పెట్టింది. ఖురాన్‌లోని వచనాన్ని ఆధారంగా తీసుకుని ఈ పేరును ఎంపిక చేశారు. దీని అర్థం 'దృఢమైన నిర్మాణం' లేదా 'సీసంతో చేసిన నిర్మాణం'. ఖురాన్‌లో ఈ పదం ఉన్న వచనంలో, అల్లాహ్ తన లక్ష్యం కోసం యుద్ధంలో పోరాడేవారిని ప్రేమిస్తాడు. వారు ఒక దృఢ నిర్మాణంలా ఉండే వారని పేర్కొనబడింది. ఈ ఆపరేషన్ పేరుతో పాక్ తాజా దాడులను ప్రారంభించింది. ఈ వివరాలను అల్ జజీరా నివేదిక వెల్లడించింది.

Details

పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ ప్రతీకార దాడులు

శుక్రవారం అర్ధరాత్రి పాకిస్తాన్‌లోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై భారత సాయుధ దళాలు ఉగ్ర ప్రతీకార దాడులు చేశాయి. రావల్పిండిలోని నూర్ ఖాన్, చక్వాల్‌లోని మురీద్, ఝాంగ్‌లోని రఫీఖీ వాయుసేన స్థావరాలపై భారత్ ధ్వంసాత్మక దాడులు చేసి కీలక సాంకేతిక మౌలిక వసతులను నేలమట్టం చేసింది. అలాగే, సరిహద్దుల్లో ఉన్న డ్రోన్ లాంచింగ్ ప్యాడ్‌ను కూడా భారత్ ధ్వంసం చేసింది.

Details

 పాక్ డ్రోన్ దాడులు, భారత్ ఎదురుదెబ్బ

జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాల్లోని 26 ప్రాంతాలపై పాకిస్తాన్ శుక్రవారం రాత్రి డ్రోన్లు ప్రయోగించింది. అయితే, భారత దళాలు వెంటనే కౌంటర్-డ్రోన్ సిస్టమ్స్‌ వినియోగించి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు జమ్ముకశ్మీర్‌లో పలు ప్రాంతాల్లో శబ్దాలతో పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి.

Details

ప్రభుత్వ అధికారి మృతి

ఈ షెల్లింగ్ దాడుల్లో జమ్ముకశ్మీర్‌ అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ (ADC) రాజ్ కుమార్ థాపా ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున రాజౌరిలోని ఆయన నివాసంపై జరిగిన దాడిలో ఆయన మృతి చెందడం తీవ్ర విషాదానికి దారి తీసింది. జమ్మూ, శ్రీనగర్, ఉధంపూర్ ప్రాంతాల్లో కూడా శనివారం ఉదయం వరుస పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమవుతుండగా, భారత సాయుధ దళాలు సన్నద్ధంగా ఉండి ప్రతి దాడికి సమర్థవంతంగా ప్రతిస్పందిస్తున్నాయి.