
#NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
చాలా సంవత్సరాలుగా, అంతరిక్షం నుంచి మన కళ్లకు కనిపించే మానవ నిర్మాణంగా చైనా గ్రేట్‌వాల్ (గ్రేట్ వాల్ ఆఫ్ చైనా) అని చాలామంది భావిస్తూ వచ్చారు. ఇంకొందరైతే ఈజిప్ట్‌లోని ప్రాచీన పిరమిడ్లే కనిపిస్తాయని అనుకున్నారు. కానీ ఇది వాస్తవంగా ఎలా ఉంటుందంటే... మీరు మీ ఇంటి వైఫై సిగ్నల్‌ను చూస్తారా? చూడలేరు కదా! ఇదీ అంతే. అంతరిక్షం నుంచి ఈ నిర్మాణాలను చూసే వీలూఉండదు. అవి ఎంత ప్రాచీనమైనవైనా, ఎంత విస్తారంగా ఉన్నా.. వాతావరణంలోని రెండో పొర అయిన స్ట్రాటోస్ఫియర్ నుంచి మన కంటితో వీటిని చూడడం అసాధ్యం. మనం ఉపగ్రహాల ద్వారా చూసే చిత్రాలు కూడా వాస్తవానికి పక్కాగా జూమ్ చేసినవి. మరి ఇంకే నిర్మాణం కూడా స్ట్రాటోస్ఫియర్ నుంచి చూడలేమా?చూడగలం.
వివరాలు
ఎక్కడుందా ప్రాంతం!
స్ట్రాటోస్ఫియర్ ఎత్తు అంటే భూమికి సుమారు 7 నుంచి 37 మైళ్ల ఎత్తులో ఉండే స్థలం నుంచి చూస్తే, ఒక పెద్ద మానవ నిర్మాణ సమూహం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది చరిత్రలోని పాత నిర్మాణం కాదు.ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..ఇది మొత్తం ప్లాస్టిక్ షీట్లతో కప్పబడి ఉంటుంది! అదే స్పెయిన్ దేశంలోని ఎల్ ఎజిడో అనే ప్రదేశం. KGF సినిమాలో పేర్కొన్న ఎల్ డొరాడో ప్రాంతం బంగారం కోసం ప్రసిద్ధి అయితే... ఎల్ ఎజిడో బంగారంలాంటి పంటల కోసం పేరు తెచ్చుకుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ ప్రాంతాల్లో ఒకటి. దీన్ని స్థానికులు ప్రేమగా "ప్లాస్టిక్ సముద్రం" అని పిలుస్తారు.
వివరాలు
యూరోప్‌లోని మార్కెట్లకు ఇక్కడి నుంచే పంటలు ఎగుమతి
ఇక్కడ గ్రీన్‌హౌస్ వ్యవసాయం విస్తృతంగా జరుగుతోంది. స్పష్టంగా అద్దంలా మెరిసే ఈ విస్తారమైన ప్లాస్టిక్ షీట్లు అంతరిక్ష దృశ్యాల్లో కూడా కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో సుమారు 40 వేల హెక్టార్ల విస్తీర్ణంలో గ్రీన్‌హౌస్‌లు ఏర్పాటు చేశారు. ఇది కొన్ని చిన్న దేశాల కంటే పెద్దదే. ఈ గ్రీన్‌హౌస్‌లలో ముఖ్యంగా టమాటాలు, మిర్చి, దోసకాయలు, పుచ్చకాయలు వంటివి పండిస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో యూరోప్‌లోని మార్కెట్లకు ఇక్కడి నుంచే పంటలు ఎగుమతి అవుతుంటాయి.
వివరాలు
ఒకప్పుడు బీడు భూమి..ఇప్పుడు బంగారంలాంటి పంటల భూమి!
వాస్తవానికి ఒకప్పుడు ఇదంతా బీడుపడిపోయిన ఉప్పు నేల అక్కడి రైతులు మొదటగా ప్లాస్టిక్ షీట్లతో ప్రయోగాలు మొదలు పెట్టారు. భూమిని కోతకు గురికాకుండా, తేమను ఉంచేలా తాత్కాలిక గుడారాలు వేశారు. ఆ గుడారాల లోపల వేడి, తేమ వల్ల పంటలు బాగానే పెరుగుతున్నాయని గమనించారు. అప్పటి నుండి వారు వెనక్కి తిరిగి చూడలేదు. సంవత్సరాలుగా చిన్న చిన్న ప్లాస్టిక్ గుడారాలు పెద్ద గ్రీన్‌హౌస్‌లుగా మారాయి. వాటితో పాటు డ్రిప్ ఇరిగేషన్, హైడ్రోపోనిక్స్, కృత్రిమ భూముల వంటివి కూడా వృద్ధి చెందాయి. ఇవన్నీ కలిపి ఎల్ ఎజిడోను మరో ఎల్ డొరాడోగా మార్చాయి. ప్రతి ఏడాది లక్షల టన్నుల తాజా పంటలు ఇక్కడి నుంచే ప్రపంచానికి వెళుతున్నాయి.
వివరాలు
ధృవీకరించిన నాసా
ఈ ప్రాంతం అంతరిక్షం నుంచి స్పష్టంగా కనిపిస్తుందని నాసా కూడా అధికారికంగా ధృవీకరించింది. నాసా ఎర్త్ అబ్జర్వేటరీ విడుదల చేసిన చిత్రాల్లో ఎల్ ఎజిడో ప్రాంతంలోని మెరుస్తున్న గ్రీన్‌హౌస్ ప్లాస్టిక్ కవర్‌లు స్పష్టంగా కనిపించాయి. ఈ ప్లాస్టిక్ షీట్లపై పడే సూర్యకాంతి ప్రతిఫలించడంతో ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల కంటే ఎక్కువ వెలుగుతో కనిపిస్తుంది. ప్లాస్టిక్ షీట్లు కేవలం కప్పడానికే కాదు, వాతావరణాన్ని కొంత చల్లగా ఉంచడానికీ ఉపయోగపడుతున్నాయని నాసా తెలిపింది. మూడీస్ పరికరాల ద్వారా ఇది నిరూపితమైంది.
వివరాలు
వ్యవసాయంలో ప్లాస్టిక్ వినియోగం
అయితే, దీనికి ఒక నెగటివ్ వైపు కూడా ఉంది. ఇక్కడ ఉపయోగిస్తున్న టన్నుల కొద్దీ ప్లాస్టిక్... పర్యావరణ పరంగా ఒక ఆందోళనకర విషయం. అలాగే అధికంగా నీటి వినియోగం, గ్రీన్‌హౌస్‌లలో పని చేసే కార్మికుల ఆరోగ్యం పైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ వ్యవస్థ వల్ల వాతావరణం చల్లబడడం, ఆహారోత్పత్తులు పెరగడం వంటి మంచి విషయాలున్నా... వ్యవసాయంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం నిపుణుల నుండి వ్యక్తమవుతోంది.