LOADING...
Israel-Iran War: అమెరికా అధ్యక్షుడే ఇరాన్‌ శత్రువు.. ట్రంప్‌ను చంపాలని చూస్తోంది : నెతన్యాహు
అమెరికా అధ్యక్షుడే ఇరాన్‌ శత్రువు.. ట్రంప్‌ను చంపాలని చూస్తోంది : నెతన్యాహు

Israel-Iran War: అమెరికా అధ్యక్షుడే ఇరాన్‌ శత్రువు.. ట్రంప్‌ను చంపాలని చూస్తోంది : నెతన్యాహు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా మళ్లీ అగ్నిగోళంగా మారుతోంది. ప్రపంచ దేశాలు రెండు దేశాలను సంయమనం పాటించమని కోరుతున్నప్పటికీ, ఇరాన్‌, ఇజ్రాయెల్ లు తమ వైఖరిని మార్చడం లేదు. కాల్పుల విరమణపై చర్చలకు కూడా ఇరువైపులు ఆసక్తి చూపకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజా వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఆయన, ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడే ప్రధాన శత్రువని ఆరోపించారు. టెహ్రాన్‌కి డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్రమైన ద్వేషం ఉందని, ఆయనను చంపాలన్నదే వారి లక్ష్యమని నెతన్యాహు పేర్కొన్నారు.

Details

ప్రమాదకర శత్రువు డొనాల్డ్ ట్రంప్ నే

ఇరాన్‌కు నంబర్ వన్ శత్రువు డొనాల్డ్ ట్రంప్. ఆయన బలమైన నాయకుడు. తేలికపాటి ఒప్పందాలకు ఒప్పుకోరు, ప్రత్యర్థుల పట్ల సమర్థంగా స్పందిస్తారు. గతంలో ఆయన అణుఒప్పందాన్ని వ్యతిరేకించి ఖాసిం సులేమానీని హతమార్చారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదన్న ధృక్పథంతో ట్రంప్ కఠిన చర్యలు తీసుకున్నారు. అందుకే ఇప్పుడు ఇరాన్‌కు ఆయనే అత్యంత ప్రమాదకర శత్రువు అని తెలిపారు. అంతేకాదు ఇరాన్‌ ఇప్పుడు ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతోందని నెతన్యాహు అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌ దాడులు జరపడం తప్ప మరో మార్గం లేదని చెప్పారు. ఈ యుద్ధం తమ సొంత ప్రజలను కాపాడడానికే కాకుండా, యావత్ ప్రపంచాన్ని రక్షించేందుకు చేస్తున్నారని తెలిపారు. ముప్పు పూర్తిగా తొలిగించే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు

Details

ఇరాన్ కు భారీ నష్టం

ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ జరుపుతున్న వాయుసేన దాడుల వల్ల ఇరాన్‌కు భారీ నష్టాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా మిలిటరీ ఉన్నతాధికారులు లక్ష్యంగా మారుతున్నారు. ఇప్పటికే ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ (IRGC) అధిపతి హతమవగా, తాజాగా ఇంటెలిజెన్స్‌ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ కజేమీ, ఆయన ఉపాధ్యక్షుడు జనరల్ హసన్ మహాకిక్ మృతి చెందారు. వీరి మరణాన్ని నెతన్యాహు ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాక, మరో కీలక నిఘా అధికారిని కూడా హతమార్చినట్లు వెల్లడించారు.

Details

ఇరాన్ లో భూకంపం

ఇక యుద్ధంతో పాటు ప్రకృతీ విపత్తులు కూడా ఇరాన్‌ను కదిలిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఫోర్దో అణు స్థావరం వద్ద భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఈ ఘటనకు వెంటనే భూమి కంపించినట్లు తెలిసింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 2.5గా నమోదైంది. ఈ పేలుళ్లకు కారణం ఇజ్రాయెల్ జరిపిన దాడులేనని భావిస్తున్నారు. ఈ 'ఆపరేషన్ రైజింగ్ లయన్' ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు 14 మంది ఇరానియన్ అణు శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ పరిణామాలతో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం మరింత తీవ్రమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.