తుపాకులతో స్కూల్‌పై విరుచుకుపడ్డ యువతి; ఆరుగురు మృతి; బైడెన్ విచారం
అమెరికాలో దారుణం జరిగింది. ఓ యువతి మూడు అత్యాధునిక తుపాకులతో టేనస్సీ రాష్ట్రం నాష్‌విల్లేలోని ఒక ప్రైవేట్ క్రిస్టియన్ స్కూల్‌లో విచ్చలవిడిగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు సహా మొత్తం ఆరుగురు మరణించారు. పాఠశాలపై కాల్పులు జరిపిన యువతిని కాల్చి చంపినట్లు నాష్‌విల్లే పోలిసులు పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో ఆ యువతి వద్ద రెండు సెమీ ఆటోమేటిక్ రైఫిల్స్, హ్యాండ్ గన్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అమెరికాలో సామూహిక కాల్పులు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అయితే ఒక మహిళ ఇలా దాడి చేయడం మాత్రం చాలా అరుదు. 1966 నుంచి జరిగిన సామూహిక కాల్పుల్లో కేవలం నాలుగు మాత్రమే మహిళలు పాల్పడినట్లు 'ది వయలెన్స్ ప్రాజెక్ట్' అనే పరిశోధన సంస్థ పేర్కొంది.
మరణించిన వారి గౌరవార్థం జెండాను అవతనం చేయాలని బైడెన్ పిలుపు
నాష్‌విల్లేలోని పాఠశాలలో జరిగిన కాల్పులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి గౌరవార్థం వైట్‌హౌస్‌తో పాటు అన్ని సమాఖ్య భవనాల్లో జాతీయ జెండాలను సగం స్టాఫ్‌తో అవతనం చేయాలని ఆదేశించారు. కాల్పులు జరిపిన యువతిని ఆడ్రీ హేల్(28)గా గుర్తించినట్లు మెట్రోపాలిటన్ నాష్‌విల్లే పోలీస్ చీఫ్ జాన్ డ్రేక్ తెలిపారు. పక్కా ప్రణాళికతో ఆ యువతి పాఠశాలలోకి ప్రవేశించిందని పోలీసులు వెల్లడించారు. కాల్పులకు పాల్పడటానికి ముందు ఆ యువితి మ్యాప్‌ను గీసుకున్నట్లు పేర్కొన్నారు. 2023లో అమెరికాలో ఇప్పటివరకు 89 పాఠశాల్లో కాల్పులు లేదా పాఠశాల ఆస్తుల విధ్వంసం జరిగినట్లు కె-12 షూటింగ్ డేటాబేస్ చెబుతోంది. గత సంవత్సరం ఇలాంటి ఘటనలు 303 జరిగినట్లు వెల్లడించింది.