Page Loader
USA-China: సుంకాల ఉద్రిక్తతల మధ్య చైనాతో వాణిజ్య ఒప్పందానికి ట్రంప్ సిగ్నల్‌ 
సుంకాల ఉద్రిక్తతల మధ్య చైనాతో వాణిజ్య ఒప్పందానికి ట్రంప్ సిగ్నల్‌

USA-China: సుంకాల ఉద్రిక్తతల మధ్య చైనాతో వాణిజ్య ఒప్పందానికి ట్రంప్ సిగ్నల్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2025
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూకుడు నిర్ణయాలకు కేరాఫ్‌గా నిలుస్తూ చైనా విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు కనిపిస్తున్నారు. తాజాగా, చైనాతో వాణిజ్య ఒప్పందం (Trade Deal) సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. 2020లోనే చైనాతో గొప్ప వాణిజ్య ఒప్పందం జరిగిన విషయాన్ని మీడియాతో మట్లాడుతూ గుర్తుచేశారు. అమెరికా-చైనా మధ్య వాణిజ్య పోరు (Trade War) ముదురుతుందన్న భయాల మధ్య ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు విశేషంగా చర్చనీయాంశమయ్యాయి. అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుండి ట్రంప్ నోట "టారిఫ్" (Tariff) అనే పదమే ఎక్కువగా వినిపిస్తోంది. మిత్రదేశమా, శత్రుదేశమా అన్న తేడా లేకుండా అన్ని దేశాలపై పరస్పర సుంకాలు (Reciprocal Tariffs) విధిస్తానని స్పష్టంగా ప్రకటించారు.

వివరాలు 

చైనాకు ట్రంప్ ఛాలెంజ్ - కౌంటర్ చర్యలు 

అమెరికా వాణిజ్య లోటును తగ్గించేందుకు ఆయన ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 10% సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ విధించిన ఈ టారిఫ్‌లకు ప్రతిగా చైనా కూడా స్పందించింది. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న బొగ్గు, ద్రవీకృత సహజ వాయువు (LNG)పై 15% సుంకం విధిస్తున్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. అలాగే, ముడి చమురు, వ్యవసాయ పరికరాలు, భారీ ఇంజిన్లతో కూడిన కార్లపై 10% సుంకం వసూలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇలా పరస్పరం ఒకరిపై ఒకరు సుంకాలు విధించుకుంటూ వాణిజ్య యుద్ధాన్ని కొనసాగిస్తున్న తరుణంలో, ట్రంప్ నుంచి చైనా వాణిజ్య ఒప్పందంపై వచ్చిన తాజా వ్యాఖ్యలు కీలకంగా మారాయి.