
Donald Trump: 'ఆయుధాలు ఇస్తే నువ్వు మాస్కోపై నేరుగా దాడి చేయగలవా?' జెలెన్‌స్కీని ప్రశ్నించిన ట్రంప్!
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మునుపటి విధానాన్ని మార్చుకున్నట్టు తాజా సమాచారం వెల్లడిస్తోంది. ఇప్పటివరకు శాంతి సాధనకే ప్రాధాన్యతనిచ్చిన ట్రంప్... ఇప్పుడు రష్యాపై ఒత్తిడి పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్టు తాజా రాజకీయ పరిణామాలు సూచిస్తున్నాయి. జూలై 4న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీతో నిర్వహించిన గోప్యమైన సంభాషణలో ట్రంప్... "అవసరమైన ఆయుధాలు అందిస్తే, మాస్కోతో పాటు సెయింట్ పీటర్స్‌బర్గ్ వంటి రష్యా నగరాలపై మరింత తీవ్రమైన దాడులు చేయగలవా?" అని జెలెన్‌స్కీని నేరుగా ప్రశ్నించినట్టు ఓ నివేదిక వెల్లడించింది.
వివరాలు
జెలెన్ స్కీతో ట్రంప్ కీలక చర్చలు!
ఆ కథనం ప్రకారం... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన ఫోన్ సంభాషణ నిరాశాజనకంగా ముగిసిన అనంతరం ట్రంప్, జెలెన్‌స్కీతో ఈ సంభాషణ జరిపినట్టు చెబుతున్నారు. కాల్పుల విరమణ కోసం సాగిన చర్చలను రష్యా నిరాకరించడంతో అమెరికాలో ఆగ్రహం పెరుగుతోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇకపై రష్యాను నేరుగా ఎదిరించాలన్న అభిప్రాయం ట్రంప్‌లో బలపడిందని, ఇది ఆయన గత వైఖరికీ భిన్నమైనదిగా నిపుణులు భావిస్తున్నారు. రష్యాపై దాడులు ముమ్మరం చేసి... చర్చల బోల్తా వేసిన మాస్కోను మళ్లీ మేజా దగ్గరకు తెచ్చే దిశగా ట్రంప్ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్టు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
50 రోజుల్లో శాంతి ఒప్పందం కుదరకపోతే..
అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి దూరప్రహరణ ఆయుధాల పంపిణీ అంశం ఇంకా స్పష్టత పొందకపోయినా... రష్యా భూభాగంపై దాడులు తీవ్రతరం చేయాలని పాశ్చాత్య దేశాలు, అమెరికాలో విధాన రూపకర్తలు కూడా క్రమంగా పెరుగుతున్నమద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు ఆధునిక ఆయుధాలు అందించాలన్న ప్రతిపాదనను ట్రంప్ బహిరంగంగా ప్రకటించిన విషయమూ, తదుపరి 50 రోజుల్లో శాంతి ఒప్పందం కుదరకపోతే రష్యా ఎగుమతుల కొనుగోలుదారులపై ఆంక్షలు విధిస్తామని ఆయన హెచ్చరించిన విషయమూ... మాస్కో తలపెట్టిన మొండి వైఖరికి ప్రతిస్పందనగా తీసుకోవాల్సిన పరిణామాలుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.