
Trump: వాషింగ్టన్ డీసీ నుంచి నిరాశ్రయులను వెంటనే తరలించండి: ట్రంప్ ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆదివారం (ఆగస్టు 10) ఆయన వాషింగ్టన్ డీసీలో ఉన్న నిరాశ్రయులను రాజధానిలోంచి తక్షణమే తరలించాలని ఆదేశించారు. "అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలి, లేకుంటే ఖాళీ చేయించాల్సి ఉంటుంది" అని హెచ్చరించారు. ఈ నిరాశ్రయులను "రాజధాని నుంచి చాలా దూరం ఉన్న ప్రాంతాలకు" పంపిస్తామని చెప్పారు. అదేవిధంగా, నేరాలను అరికట్టేందుకు ఫెడరల్ అధికారులను మళ్లీ నియమిస్తానని బెదిరించారు. అయితే నగర పోలీసుల గణాంకాల ప్రకారం, వాషింగ్టన్ డీసీలో హింసాత్మక నేరాలు గత 30 ఏళ్లలో కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.
వివరాలు
అమెరికా-మెక్సికో సరిహద్దు చర్యల మాదిరిగానే వేగంగా..
ఆదివారం ట్రూత్ సోషియల్‌లో పోస్టు చేసిన ట్రంప్, "నిరాశ్రయులు వెంటనే వెళ్లిపోవాలి" అని రాశారు. వారికి ఉండటానికి సదుపాయాలు కల్పిస్తామని, కానీ అవి రాజధానికి చాలా దూరంగా ఉంటాయని చెప్పారు. తన పోస్ట్‌లో వైట్ హౌస్ నుంచి వర్జీనియాలోని గాల్ఫ్ క్లబ్‌కి వెళ్తున్నప్పుడు తీసిన ఫోటోలు జోడించారు. అందులో హైవే పక్కన టెంట్లు, ఒక భవనం మెట్లపై నిద్రిస్తున్న వ్యక్తి, రోడ్డుపక్క చెత్త మొదలైన దృశ్యాలు ఉన్నాయి. నేరస్తులను హెచ్చరిస్తూ, "మీరు వెళ్లాల్సిన పనిలేదు... మేము మిమ్మల్ని జైలుకి పంపిస్తాం" అన్నారు. ఇది అమెరికా-మెక్సికో సరిహద్దు చర్యల మాదిరిగానే వేగంగా జరుగుతుందని చెప్పారు.
వివరాలు
"ఫ్రీ డీసీ" ఉద్యమకారులు నిరసన
ట్రంప్ ఈ పోస్ట్‌లో సోమవారం (ఆగస్టు 11) జరగబోయే ప్రెస్ మీట్ గురించి కూడా ప్రచారం చేశారు. ఆ సమావేశం "వాషింగ్టన్‌లో హింసాత్మక నేరాలను పూర్తిగా ఆపేస్తుంది" అని పేర్కొన్నారు. అదేవిధంగా, "నేరాలు, హత్యలు, మరణాల అరికట్టడమే కాకుండా నగర శుభ్రతపై కూడా" చర్చిస్తామని చెప్పారు. అదే సమయానికి "ఫ్రీ డీసీ" ఉద్యమకారులు నిరసన కార్యక్రమం ప్రకటించారు. అయితే ది గార్డియన్ నివేదిక ప్రకారం, ట్రంప్ చెప్పినట్టుగా వాషింగ్టన్‌లో నిరాశ్రయులు, నేరాల వ్యాప్తి పెద్ద స్థాయిలో లేవు. అక్కడ ప్రతి రాత్రి సుమారు 800 మంది నిరాశ్రయులు రోడ్లపై, 3,275 మంది అత్యవసర ఆశ్రయాల్లో, 1,065 మంది తాత్కాలిక నివాసాల్లో ఉంటారని 'కమ్యూనిటీ పార్ట్‌నర్‌షిప్' సంస్థ తెలిపింది.
వివరాలు
2024లో 26% తగ్గిన హింసాత్మక నేరాలు
ఇక హింసాత్మక నేరాలు 2024లో 2023తో పోలిస్తే 35% తగ్గగా,ఈ ఏడాది ఇప్పటివరకు మరో 26% తగ్గినట్లు మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. "మా నగరంలో నేరాల పెరుగుదల లేదు"అని మేయర్ మూరియల్ బౌసర్ తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా హింసాత్మక నేరాలను 30 ఏళ్ల కనిష్ట స్థాయికి తగ్గించామన్నారు. "ఫెడరల్ పోలీసులు ఎప్పుడూ డీసీ వీధుల్లో ఉంటారు.. మేము వారితో ఎప్పుడూ కలిసే పనిచేస్తుంటాం" అని చెప్పారు.
వివరాలు
1973లో అమల్లోకి వచ్చిన 'హోమ్ రూల్ యాక్ట్'రద్దు
ట్రంప్ ఇటీవల స్థానిక పోలీసులు ఇప్పటికే పరిష్కరించిన ఒక దాడి కేసు కారణంగా డీసీలో ఫెడరల్ పోలీసు పహారాలను పెంచాలని ఆదేశించారు. అంతేకాకుండా, 1973లో అమల్లోకి వచ్చిన 'హోమ్ రూల్ యాక్ట్'ను రద్దు చేసి నగరంపై నేరుగా ఫెడరల్ నియంత్రణ పెట్టే ఆలోచనను కూడా వెలిబుచ్చారు. ఈ చట్టాన్ని రద్దు చేసే అవకాశాన్ని వైట్ హౌస్ న్యాయవాదులు పరిశీలిస్తున్నారని సమాచారం.