Page Loader
Trump Tariffs: 150 కి పైగా దేశాలకు 10-15% సుంకాలు: ట్రంప్ 
150 కి పైగా దేశాలకు 10-15% సుంకాలు: ట్రంప్

Trump Tariffs: 150 కి పైగా దేశాలకు 10-15% సుంకాలు: ట్రంప్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2025
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై దాడి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 150 కంటే ఎక్కువ దేశాలపై 10 శాతం లేదా 15శాతం మేర సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయా దేశాలకు సుంకాల రేట్లను స్పష్టంగా తెలిపే లేఖలను పంపనున్నట్లు వెల్లడించారు. 150 కంటే ఎక్కువ దేశాలకు నోటీసులు జారీ చేస్తామని, అందులో వారికి విధించబోయే సుంకాల శాతం పేర్కొనబడుతుందని తెలిపారు. ఈ దేశాలన్నింటికీ ఒకే విధంగా సుంకాలను విధించనున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. అవన్నీ పెద్ద దేశాలేమీ కావని,తమ దేశంతో గణనీయమైన వాణిజ్యం కూడా నిర్వహించవని అన్నారు. అయితే 10 నుంచి 15శాతం వరకు సుంకాలను విధించే అవకాశముందని పేర్కొన్నారు.

వివరాలు 

రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తున్న దేశాలపై 500శాతం సుంకాలు 

ఇక మరోవైపు రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తున్న దేశాలపై 500శాతం సుంకాలను విధించనున్నట్లు అమెరికా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికోసం ప్రత్యేకబిల్లును తీసుకురానున్నట్లు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఇటీవల వెల్లడించారు. అదే విధంగా నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రూట్ కూడా ఇదే విధమైన హెచ్చరికలు జారీ చేశారు. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలు ఆర్థిక ఆంక్షలకు లోనవుతాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా రష్యా నుంచి చమురు,సహజ వాయువు దిగుమతి చేసుకునే దేశాలపై అదనంగా 100శాతం ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. ''మీరు భారత ప్రధాని అయినా,చైనా అధ్యక్షుడు అయినా,బ్రెజిల్ అధ్యక్షుడైనా,రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే,వారి చమురు,సహజ వాయువును కొనుగోలు చేస్తే మీపై అదనంగా 100శాతం ఆంక్షలు విధిస్తాము''అని రూట్ స్పష్టంగా ప్రకటించారు.

వివరాలు 

పుతిన్‌ను నేరుగా ఫోన్ చేసి శాంతి చర్చల కోసం ఒత్తిడి చేయాలి: నాటో ప్రధాన కార్యదర్శి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చిన నేపథ్యంలో నాటో ప్రధాన కార్యదర్శి ఈ హెచ్చరికలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్, చైనా, బ్రెజిల్ నాయకులు శాంతి చర్చలపై దృష్టి సారించాలి అని, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని రూట్ కోరారు. తన హెచ్చరికలను ఈ మూడు దేశాల నాయకులు పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని కూడా ఆయన హెచ్చరించారు. పుతిన్‌ను నేరుగా ఫోన్ చేసి శాంతి చర్చల కోసం ఒత్తిడి చేయాలని, చర్చలను తీవ్రంగా పరిగణించాలని కోరారు. అదేవిధంగా తమ హెచ్చరికలను పాటించకపోతే భారత్, బ్రెజిల్, చైనా దేశాలకు గణనీయమైన నష్టం వాటిల్లుతుందని రూట్ హెచ్చరించారు.

వివరాలు 

రష్యా ఎగుమతులపై 100 శాతం సుంకాలు

అంతేకాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకునే దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఉక్రెయిన్‌తో 50 రోజుల లోపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా కుదుర్చుకోకపోతే రష్యా ఎగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.