LOADING...
Trump on Heaven: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరిస్తే 'స్వర్గానికే'.. ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరిస్తే 'స్వర్గానికే'.. ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Trump on Heaven: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరిస్తే 'స్వర్గానికే'.. ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2025
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధానికి ముగింపు దిశగా తన వంతు కృషి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో శాంతి ఒప్పందం సాధించడం తనను స్వర్గానికి చేరుకునే అవకాశాలను పెంచుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, ప్రస్తుతం ఆ అవకాశాలు పెద్దగా లేవని, అయితే ఇది చమత్కారంగానే చెబుతున్నానని వ్యాఖ్యానించారు. గతంలోనూ యుద్ధం ముగింపు దిశగా చర్యలు చేపట్టడం, వాటి వెనుక నోబెల్‌ శాంతి బహుమతి గెలుచుకోవాలన్న తన ఆశయం కూడా ఉందని ట్రంప్‌ బహిరంగంగానే వెల్లడించిన సంగతి తెలిసిందే.

వివరాలు 

నేను నిజంగానే స్వర్గానికి వెళ్లే అవకాశం ఉంటే..

మాస్కో-కీవ్‌ మధ్య శాంతి చర్చలు వేగం పుంజుకునేలా చర్యలు చేపట్టిన ట్రంప్‌, ఇటీవల రష్యా, ఉక్రెయిన్‌ అధ్యక్షులతో పాటు యూరోపియన్‌ దేశాల నేతలతో కూడా భేటీలు జరిపారు. ఈ పరిణామాల నడుమ ఆయన, తాను చేస్తున్న కృషి కేవలం రాజకీయాలకు పరిమితం కాదని, వ్యక్తిగత జీవితానికి సంబంధించినదేనని అన్నారు. ''నేను శాంతి కోసం ప్రయత్నిస్తున్నాను. వీలైతే స్వర్గానికి చేరుకోవాలన్న ఆశ కూడా ఉంది. నేను బాగా పనిచేయడం లేదని కొందరు అంటున్నారు. కానీ నేను నిజంగానే స్వర్గానికి వెళ్లే అవకాశం ఉంటే, దానికి కారణాలలో ఒకటి ఈ శాంతి ప్రయత్నాలే అవుతాయి'' అని ట్రంప్‌ స్పష్టం చేశారు.

వివరాలు 

భగవంతుడే నన్ను రక్షించాడు: ట్రంప్ 

ఇప్పటికే ఎన్నో విమర్శలు,కోర్టు కేసులు,అభియోగాలను ఎదుర్కొన్న ట్రంప్‌.. గతేడాది జరిగిన హత్యాయత్నం నుంచి బయటపడిన తరువాత తన ఆలోచనల్లో ఒక మార్పు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన పలు సందర్భాల్లో దేవుడి గురించి ఎక్కువగా మాట్లాడడం,తన జీవితంలో దైవభక్తిని ప్రదర్శించడం గమనార్హం. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత కూడా ''భగవంతుడే నన్ను రక్షించాడు. అమెరికాను మళ్లీ మహోన్నతంగా తీర్చిదిద్దేందుకు ఆయనే నన్ను నిలబెట్టాడు'' అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా వైట్‌హౌస్‌లో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణను పెంచి, ప్రత్యేకంగా ఒక ఆధ్యాత్మిక గురువును సలహాదారుగా నియమించుకోవడం విశేషంగా మారింది.

వివరాలు 

స్పందించిన కరోలిన్‌ లీవిట్‌

ట్రంప్‌ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలపై వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ స్పందించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు సరదాగా కాకుండా నిజంగానే ఆయన మనసులో ఉన్న ఆలోచనలని స్పష్టం చేశారు. ''స్వర్గానికి వెళ్లాలన్నది అధ్యక్షుడి కోరిక. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన మాదిరిగానే ఆ ఆశయం కలిగి ఉండాలని నేను నమ్ముతున్నాను'' అని లీవిట్‌ అన్నారు.