Trump: ఆరోగ్య కార్యదర్శిగా రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ ఎంపిక.. ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయాన్ని సాధించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. తన కార్యవర్గాన్ని ఆకారంలోకి తీసుకొచ్చేందుకు రిపబ్లికన్ నేత ప్రధానంగా దృష్టి పెట్టారు. ముఖ్యమైన పదవులకు వ్యక్తుల నియామకంలో కసరత్తులు జరుగుతున్నాయి. ఇప్పటికే తన విజయంలో ప్రాధాన్యమైన పాత్ర పోషించిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ఇండో అమెరికన్ వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా ఆరోగ్య మంత్రిగా మాజీ డెమోక్రటిక్ నేత రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ (Robert F Kennedy Jr)ను నామినేట్ చేసినట్లు ప్రకటించారు.
నామినేషన్‌ను యూఎస్ సెనెట్ ఆమోదించాలి
''ఆరోగ్యం,మానవ సేవల మంత్రిత్వ శాఖకు రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్‌ను ఎంపిక చేయడం గర్వంగా ఉంది. శాస్త్రీయ పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచి, ఆరోగ్య రంగంలో పారదర్శకత తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని నమ్ముతున్నాను. దీర్ఘకాల వ్యాధుల వ్యాప్తిని అరికట్టి, అమెరికాను ఆరోగ్యవంతమైన దేశంగా మార్చగలరని నాకు విశ్వాసం ఉంది'' అని ట్రంప్ తన 'ట్రూత్' సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నామినేషన్‌ను యూఎస్ సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది.
ట్రంప్ విజయానికి సహకారం
జూనియర్ కెన్నడీ అమెరికా రాజకీయ కుటుంబ వారసత్వం కలిగిన వ్యక్తి. మాజీ అటార్నీ జనరల్ రాబర్ట్ ఎఫ్ కెన్నడీ కుమారుడైన ఆయన, అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీకి బంధువు. గతంలో వ్యాక్సిన్లపై విపరీతమైన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గతేడాది జరిగిన డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీల్లో జో బైడెన్‌కు వ్యతిరేకంగా పోటీచేశారు. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు కానీ అనంతరం ట్రంప్‌కు మద్దతు ప్రకటించి, పోటీ నుంచి వైదొలిగారు. చివర్లో రిపబ్లికన్ నేత ట్రంప్‌తో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని, ట్రంప్ విజయానికి సహకరించారు. తద్వారా ఆయన ట్రంప్ ప్రభుత్వంలో చోటు పొందారు.