PM Modi Trump Meet: ముందుగా టారీఫ్‌లు... తర్వాత వాణిజ్య ఒప్పందాలు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో గణనీయమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ప్రకటించారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే, మిత్రదేశం అనే తేడా లేకుండా అనేక దేశాలపై ట్రంప్ 'రెసిప్రొకల్ టారీఫ్' (పరస్పర సుంకాలు) విధించిన కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన వచ్చింది.
వివరాలు
ట్రంప్-మోదీ భేటీకి ముందు జరిగిన పరిణామాలు
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ వాణిజ్యంపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
గురువారం, మిత్రదేశాలకు కూడా ఊహించని షాక్ ఇచ్చారు! అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు అధిక సుంకాలు విధిస్తున్నాయని, అందుకే తాను ప్రతిస్పందనగా కొత్త టారీఫ్‌లను అమలు చేస్తున్నానని వెల్లడించారు.
ఈ మేరకు ఒక అధికారిక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు.
ఈ సందర్భంగా భారత్ గురించిన అంశాన్ని ట్రంప్ ప్రస్తావించారు.
"అమెరికాపై అత్యధికంగా టారీఫ్‌లు విధిస్తున్న దేశాల్లో భారతదేశం కూడా ఉంది!" అని ట్రంప్ పేర్కొన్నారు.
ఫలితంగా, భారత్‌పై కూడా ట్రంప్ టారీఫ్ నియంత్రణలు అమలు చేయాలని నిర్ణయించారు.
వివరాలు
కొత్త టారీఫ్‌లు ఏమిటి?
"మనపై ఇతర దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్నాయి.అందుకే సమానత్వం కోసం రెసిప్రొకల్ టారీఫ్‌లు అమలు చేస్తున్నాను. ఈ నిర్ణయంపై ఎవరూ ఫిర్యాదు చేయకూడదు,"అని ట్రంప్ స్పష్టం చేశారు.
అయితే,ఈ కొత్త టారీఫ్‌లు ఏమిటి? అవి ఎప్పుడు అమలవుతాయి? అనే విషయాల గురించి ట్రంప్ మరిన్ని వివరాలు వెల్లడించలేదు.
వైట్ హౌస్ నుండి కూడా ఈ అంశంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే, వీటి అమలు కొన్నిరోజులు లేదా కొన్ని వారాలు అవ్వచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం,అమెరికా భారతదేశ ఉత్పత్తులపై సగటున 3.3% టారీఫ్ విధిస్తున్నప్పటికీ,భారత్ మాత్రం అమెరికా వస్తువులపై 17% వరకు సుంకాలను అమలు చేస్తోంది.
దీన్ని బట్టి,తాజా నిర్ణయం భారత్‌కు తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వివరాలు
ట్రంప్-మోదీ సమావేశం అనంతరం ప్రకటనలు
వైట్ హౌస్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ-డొనాల్డ్ ట్రంప్ సమావేశం అనంతరం ట్రంప్ భారత్‌తో సంబంధాలపై సానుకూలంగా స్పందించారు.
"భవిష్యత్తులో ఇండియాతో అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాం. భారత్ ఇప్పటికే మా నుంచి పెద్ద మొత్తంలో చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తోంది," అని ట్రంప్ ప్రకటించారు.
"ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించేందుకు అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా కలిసి పని చేయాలని మోదీతో కలిసి నిర్ణయించుకున్నాము," అని ఆయన వెల్లడించారు.
వివరాలు
భారత్‌కు ఎఫ్-35 యుద్ధ విమానాలు
భారత రక్షణ రంగానికి సంబంధించి కీలక ప్రకటన చేస్తూ, ట్రంప్ భారత్‌కు ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్ విక్రయించనున్నట్లు తెలిపారు.
"ఈ ఏడాది నుంచి మిలిటరీ వ్యాపారాన్ని పెంచుతూ, భారత్‌కు అత్యాధునిక ఫైటర్ జెట్స్ అందించబోతున్నాం," అని ఆయన అన్నారు.
ఎఫ్-35 యుద్ధ విమానాలు ప్రపంచంలోనే అత్యాధునిక డిఫెన్స్ టెక్నాలజీ కలిగిన విమానాలుగా గుర్తించబడ్డాయి.
అయితే, గతంలో అమెరికా ఈ విమానాలను భారత్‌కు అందించేందుకు నిరాకరించింది. భారతదేశం రష్యాతో బలమైన రక్షణ సంబంధాలను కలిగి ఉండటం దీనికి కారణంగా పేర్కొనబడింది.
కానీ ఇప్పుడు, అమెరికా తన వైఖరిని మార్చి భారత్‌కు ఈ అధునాతన యుద్ధ విమానాలను అందించేందుకు సిద్ధమైంది.
వివరాలు
భారత్-అమెరికా వాణిజ్య లక్ష్యం
భారత్,అమెరికా దేశాలు 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 500 బిలియన్ డాలర్లకు చేర్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాయని ప్రధాని మోదీ ప్రకటించారు.
త్వరలోనే పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాలు కలిసి పనిచేయనున్నాయని ఆయన తెలియజేశారు.
26/11 ఉగ్రదాడుల్లో నిందితుడు తహావుర్ రాణా భారత్‌కు రాబోతున్నాడా?
ముంబై 26/11 ఉగ్రదాడుల నిందితుడు తహావుర్ రాణాను భారత్‌కు అప్పగించనున్నట్టు ట్రంప్ ప్రకటించారు.
మోదీతో భేటీ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.