Trump: 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ముగింపు దిశగా ట్రంప్ సంకేతాలు.. ప్రపంచానికి ఊరట?
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ఐదు వారాలు పూర్తయ్యాయి. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో అనేక దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ విధించిన ఆంక్షలు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి. రోజురోజుకూ గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పెరుగుతోంది.ఈ నేపథ్యంలో అమెరికా నుంచి ఒక కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' (Operation Epic Fury)ను ముగించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆయన తన సన్నిహిత సహాయకులతో చెప్పినట్లు The Wall Street Journal నివేదించింది.
వివరాలు
ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశం
హోర్ముజ్ జలసంధి పూర్తిగా తిరిగి తెరవకపోయినా యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ భావిస్తున్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. ఈ సమాచారం ప్రపంచ దేశాలకు కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. యుద్ధం ప్రారంభ సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమవుతున్నాయి. ఆరు వారాల్లో యుద్ధం ముగుస్తుందని అప్పట్లో ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో యుద్ధం ఐదు వారాలు పూర్తయ్యింది. ఇప్పుడు పరిస్థితులను విశ్లేషించిన ట్రంప్, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం చాలా క్లిష్టమైన ప్రక్రియగా మారిందని భావిస్తున్నారు. అది యుద్ధాన్ని మరింత పొడిగించే అవకాశముందని ఆయన అంచనా వేస్తున్నారు.
వివరాలు
ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కీలక వ్యాఖ్యలు
అందువల్ల, ప్రస్తుతానికి ఆ జలసంధిని ఇరాన్ నియంత్రణలోనే ఉంచి, ప్రధానంగా ఇరాన్ నౌకాదళాన్ని బలహీనపరచడం,క్షిపణి నిల్వలను ధ్వంసం చేయడంపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక దౌత్యపరంగా పరిస్థితులు మారితే, యూరప్,గల్ఫ్ దేశాల సహకారంతో తదుపరి చర్యలు తీసుకోవచ్చని ట్రంప్ యోచిస్తున్నారు. ఇదే సమయంలో,మంగళవారం జరిగిన వైట్ హౌస్ మీడియా సమావేశంలో ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కీలక వ్యాఖ్యలు చేశారు. చమురు ట్యాంకర్ల సురక్షిత రాకపోకలను పునరుద్ధరించడం అనేది యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ నిర్దేశించుకున్న ప్రధాన లక్ష్యాల్లో లేదని ఆమె స్పష్టం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఈ యుద్ధం ఎటు దిశగా సాగుతుందన్నది ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.ట్రంప్ తీసుకునే తదుపరి నిర్ణయాలు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై కీలక ప్రభావం చూపనున్నాయి.