Page Loader
Trump - Musk: అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలిస్తే.. వైట్‌హౌస్‌లోకి మస్క్‌! 
Trump - Musk: అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలిస్తే.. వైట్‌హౌస్‌లోకి మస్క్‌!

Trump - Musk: అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలిస్తే.. వైట్‌హౌస్‌లోకి మస్క్‌! 

వ్రాసిన వారు Sirish Praharaju
May 30, 2024
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

మరికొద్ది నెలల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులంతా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. వీరికి మద్దతిస్తున్న వారు కూడా తమ అభిప్రాయాలను బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే,టెస్లా,స్పేస్‌ఎక్స్‌ సీఈవో సీఈఓ ఎలాన్ మస్క్‌ను తన సలహాదారుడిగా నియమించుకోవాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నివేదిక పేర్కొంది. అయితే టెస్లా సీఈవోను సలహాదారుగా చేయాలనే నిర్ణయాన్నిట్రంప్ ఇంకా ఖరారు చేయలేదు. మీడియా కథనాల ప్రకారం,మస్క్, ట్రంప్ ఇప్పటికే చాల అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారిద్దరి మధ్య తరచుగా ఫోన్ సంభాషణలు జరుగుతున్నట్లు ట్రంప్ బృందంలోని కొందరు వెల్లడించారు. సరిహద్దు,ఆర్థిక వ్యవస్థ,ఓటింగ్ మోసాన్నినిరోధించడం,విద్యుత్తు వాహనాల వంటి విధానాల రూపకల్పనలో మస్క్‌ సలహాలు తీసుకోనున్నట్లు సమాచారం.

Details 

బహిరంగంగానే బైడెన్‌ను వ్యతిరేకించిన మస్క్ 

ఒక నెలలోనే చాలాసార్లు ఒకరితో ఒకరు(ట్రంప్,మస్క్) ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇది మాత్రమే కాదు, అధ్యక్షుడు జో బైడెన్‌కు మద్దతు ఇవ్వకుండా కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లను ఎలా ఒప్పించాలో మస్క్, బిలియనీర్ ఇన్వెస్టర్ నెల్సన్ పెల్ట్జ్ కూడా ట్రంప్‌తో చర్చించారు. బైడెన్‌కు మద్దతు ఇవ్వకూడదని కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లను ఒప్పించేందుకు నవంబర్‌లో ప్రచారం ప్రారంభించారు. SpaceX సృష్టికర్త , సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X యజమాని మస్క్ బైడెన్‌ను బహిరంగానే వ్యతిరేకించారు. అలాగని, మస్క్ ఎక్కడా ప్రత్యక్షంగా రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు.గత కొంత కాలంగా మాత్రం డైమోక్రాటిక్‌ పార్టీ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు మస్క్. జో బైడెన్‌ నిర్లక్ష్యం వల్లే మెక్సికో నుంచి అమెరికాకు అక్రమ వలసలు పెరుగుతున్నాయని విమర్శించారు. విద్యుత్ వాహనాలు,ఆర్థిక విధానాల్లోనూ లోపాలున్నాయన్నారు.

Details 

సూపర్‌ ట్యూస్‌డే ప్రైమరీల్లో ట్రంప్‌ని కలిసిన మస్క్

సూపర్‌ ట్యూస్‌డే ప్రైమరీల్లో డొనాల్డ్ ట్రంప్‌ గెలుపు తర్వాత మస్క్ ఆయన్ని కలిశారు. అనంతరం తాను ఏ పార్టీకి విరాళాలు ఇవ్వాలనుకోవడం లేదని తెలిపారు. అంతకముందు ఇతర వ్యాపారులలాగా ఇరు పార్టీలకు సమానంగా ఫండ్స్ సమకూర్చేవారు. కానీ, ఈసారి మాత్రం బైడెన్‌ను ఓడించాలని తోటి వ్యాపారవేత్తలను ప్రభావితం చేస్తున్నారని సమాచారం. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌, ట్రంప్‌ తలపడనున్న విషయం తెలిసిందే.