LOADING...
GDP: ట్రంప్ 25% టారిఫ్‌‌‌‌‌‌‌‌లతో తంటాలే .. జీడీపీ 50-60 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం
ట్రంప్ 25% టారిఫ్‌‌‌‌‌‌‌‌లతో తంటాలే .. జీడీపీ 50-60 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం

GDP: ట్రంప్ 25% టారిఫ్‌‌‌‌‌‌‌‌లతో తంటాలే .. జీడీపీ 50-60 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 01, 2025
02:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25 శాతం టారిఫ్ విధిస్తూ అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం భారత ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ టారిఫ్‌తో భారత జీడీపీ వృద్ధి రేటు 50 నుంచి 60 బేసిస్ పాయింట్లు (అంటే సుమారు 0.5%-0.6%) తగ్గే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ భారత్‌కు వ్యతిరేకంగా రష్యాతో వాణిజ్యం చేస్తున్నందుకు పెనాల్టీ విధిస్తానని హెచ్చరించారు. ఇక ఇప్పుడు 25 శాతం టారిఫ్‌తో పాటు,పెనాల్టీ విధిస్తే, భారత వృద్ధి రేటు 6.1 శాతం కంటే దిగువకి, అంటే 6 శాతం కంటే తక్కువకి పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

2025-26 ఆర్థిక సంవత్సరానికి 6.5 శాతం వృద్ధి రేటు అంచనా

ఇక రిజర్వ్ బ్యాంక్ (RBI) గతంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి 6.5 శాతం వృద్ధి రేటు అంచనా వేసింది. కేంద్ర ఆర్థిక శాఖ 6.3% నుంచి 6.8% మధ్య వృద్ధి వుంటుందని అంచనా వేసింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ అంచనాలు మారిపోయేలా కనిపిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తెలిపిన వివరాల ప్రకారం, 20 శాతం టారిఫ్ విధిస్తే భారత జీడీపీకి 50 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చని వెల్లడించింది. అయితే 25 శాతం టారిఫ్ అయితే దాదాపు 62 బేసిస్ పాయింట్ల వృద్ధి కోత వచ్చే అవకాశముంది. దాంతో భారత జీడీపీ వృద్ధి 5.87 శాతం వరకూ పడిపోవచ్చని అంచనా.

వివరాలు 

దేశ ఆర్థిక వ్యవస్థ పై భారీ ప్రభావం

అంతేకాదు, ఎస్బీఐ అంచనాల ప్రకారం, ప్రతి 1 శాతం టారిఫ్ పెరిగితే, ఎగుమతుల పరిమాణం 0.5 శాతం తగ్గుతుంది. అంటే, 25 శాతం టారిఫ్‌తో 12.5 శాతం ఎగుమతుల తగ్గుదల చోటుచేసుకోవచ్చు. అమెరికా భారత్‌కు అతిపెద్ద ఎగుమతుల గమ్యస్థానం కాబట్టి, ఇది దేశ ఆర్థిక వ్యవస్థ పై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇతర ఆర్థిక నిపుణులు కూడా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం చూపించగలదని భావిస్తున్నారు. ANZ ఆర్థిక శాస్త్రవేత్తలు ధీరజ్ నిమ్, సంజయ్ మాథుర్ లు అభిప్రాయపడుతూ.. ఈ 25 శాతం టారిఫ్ 2025-26 సంవత్సరంతా కొనసాగితే, కనీసం 40 బేసిస్ పాయింట్ల వరకు జీడీపీ తగ్గుతుందని చెప్పారు.

వివరాలు 

 15-20 శాతం వరకు టారిఫ్ కొనసాగుతుందని అంచనా 

మరోవైపు Barclays సంస్థ ఈ ప్రభావాన్ని 30 బేసిస్ పాయింట్లు, నోమురా సంస్థ 20 బేసిస్ పాయింట్లు ఉంటుందని అంచనా వేసాయి. అయితే కొన్ని రంగాలకు మినహాయింపులు ఇవ్వడంతో, ప్రభావిత టారిఫ్ రేటు సగటున 20 శాతంగా ఉండవచ్చని నోమురా తెలిపింది. ఆగస్ట్ 1 తర్వాత మళ్లీ చర్చలు జరగవచ్చని, దాంతో టారిఫ్ రేటు కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, కనీసం 15-20 శాతం వరకు టారిఫ్ కొనసాగుతుందన్నదే ప్రస్తుత అంచనా. ఇది భారత్ ఆశించిన ఫలితం కాదని నిపుణుల అభిప్రాయం.