
America praises Pakistan: ఉగ్రవాద సంస్థలను అణచి వేసే కృషిలో..పాక్‌పై అమెరికా ప్రశంసలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌తో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న తరుణంలో అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఉగ్రవాద సంస్థలను అణచి వేసే కృషిలో పాకిస్థాన్ సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపింది. ఇటీవల పాక్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో మృతులైన వారికి సానుభూతి వ్యక్తం చేసింది.ఇస్లామాబాద్‌లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై పాక్,అమెరికా ప్రతినిధులు చర్చలు ముగించుకున్న అనంతరం ఇరు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. లష్కరే తొయిబా అనుబంధ సంస్థ అయిన "ది రెసిస్టెన్స్ ఫ్రంట్" (TRF)ను అమెరికా కొద్దిరోజుల క్రితమే ఉగ్రవాద జాబితాలో చేర్చింది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నపాకిస్థాన్‌కు పహల్గాం దాడి సంబంధం ఉందని భారత్ స్పష్టమైన ఆధారాలతో చూపిస్తున్న వేళ,అదే అమెరికా నుంచి ఇలాంటి ప్రకటన రావడం విశేషంగా మారింది.
వివరాలు
మాజిద్ బ్రిగేడ్‌ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది
"ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా శాంతి, భద్రతలకు ముప్పు కలిగించే ఉగ్ర సంస్థలను అణచివేయడంలో పాకిస్థాన్ విజయవంతమైందని అమెరికా ప్రశంసలు అందించింది" అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నట్లు పాక్ విదేశాంగశాఖ వెల్లడించింది. బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, ఐసిస్-ఖోరాసన్, తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ వంటి ఉగ్ర సంస్థల నుంచి ఉత్పన్నమవుతున్న ప్రమాదాలను ఎదుర్కొనే వ్యూహాలపై ఇరు దేశాలు చర్చించినట్టు తెలిపింది. దీనికి ఒకరోజు ముందు బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, దాని మిలిటెంట్ విభాగం మాజిద్ బ్రిగేడ్‌లను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే.
వివరాలు
సంబంధాల్లో మార్పు లేదన్న యూఎస్
భారత్, పాకిస్థాన్‌లతో తమ సంబంధాల్లో ఎటువంటి మార్పు లేదని, పూర్వం మాదిరిగానే సుహృద్భావ సంబంధాలు కొనసాగుతున్నాయని అమెరికా స్పష్టం చేసింది. ఇరు దేశాల దౌత్య ప్రతినిధులు సమర్పణ భావంతో విధులు నిర్వర్తిస్తున్నారని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి తెలిపారు. భారత్‌తో సహా ప్రపంచంలోని సగం దేశాలపై అణ్వస్త్రాలు ప్రయోగిస్తామని పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో యూఎస్ ఇలాంటి స్పందన ఇవ్వడం గమనార్హం.