Donald Trump:విడుదలైన గంటల్లోనే బెస్ట్ సెల్లర్‌గా ట్రంప్ పుస్తకం 'సేవ్ అమెరికా'
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆయన కొత్త పుస్తకం 'సేవ్ అమెరికా' విడుదలైన కొద్దిసేపటికే అమెజాన్‌లో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. 92.06 డాలర్ల ధర ఉన్నప్పటికీ, 'ప్రెసిడెంట్స్ అండ్ హెడ్స్ ఆఫ్ ది స్టేట్ బయోగ్రఫీస్' జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది,మొత్తం జాబితాలో 13వ స్థానంలో ఉంది. ఈ పుస్తకంలో ట్రంప్ తన అధ్యక్ష పదవీకాలం,ప్రచార సమయంలోని ముఖ్యమైన సంఘటనలను వివరించారు. జులై నెలలో పెన్సిల్వేనియాలో బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ఓ యువకుడు కాల్పులు జరిపిన ఘటన గుర్తుంచుకుంటే,ఆ సమయంలో రక్తమోడుతున్న గాయంతో ఉన్నప్పటికీ,ట్రంప్ సత్వరంగా తేరుకుని వేదికపై పిడికిలి బిగించి'ఫైట్' అంటూ నినదించినప్పటి ఫొటో పుస్తక కవర్ పేజీపై ప్రింట్ చేశారు.
'సేవ్ అమెరికా'లో తన తొలిపాలనకు సంబంధించిన ముఖ్యఘట్టాలు
పుస్తకంలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఉత్తరకొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్‌తో ఉన్న ఫొటోలను కూడా చేర్చినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ట్రంప్ మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌పై విమర్శలు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ గురించి సమర్థన కూడా ఈ పుస్తకంలో ఉంది. 'సేవ్ అమెరికా'లో, తన గత పదవీకాలంతో పాటు, మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాంటి పాలన అందించాలనుకుంటున్నారో వెల్లడించారు. పన్నులు, అంతర్జాతీయ దౌత్యం, సరిహద్దు భద్రత వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. ట్రంప్ తన సోషల్ మీడియా యాప్ 'ట్రూత్'లో ఈ పుస్తకాన్ని ప్రమోట్ చేసి, అందులోని ప్రతీ ఫొటోను తానే ఎంపిక చేసినట్లు తెలిపారు.