Loading...
Trump: పుతిన్‌తో ట్రంప్‌ అనూహ్య ఒప్పందం.. రష్యా డీజిల్‌పై ఆంక్షలు ఎత్తివేత!
పుతిన్‌తో ట్రంప్‌ అనూహ్య ఒప్పందం.. రష్యా డీజిల్‌పై ఆంక్షలు ఎత్తివేత!

Trump: పుతిన్‌తో ట్రంప్‌ అనూహ్య ఒప్పందం.. రష్యా డీజిల్‌పై ఆంక్షలు ఎత్తివేత!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 10, 2026
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా నుంచి చమురు, సహజ వాయువును కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని ఇన్నాళ్లూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనూహ్యంగా తన వైఖరిని మార్చుకున్నారు. ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో డీజిల్‌ కొనుగోళ్లకు సంబంధించి శుక్రవారం ఒప్పందం కుదుర్చుకున్నారు. అమెరికాలో ఇంధన ధరలు పెరుగుతుండటం, ఈ అంశం నవంబరులో జరగనున్న మధ్యంతర ఎన్నికల వేళ తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో ట్రంప్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి డీజిల్‌ దిగుమతులపై విధించిన ఆంక్షలను 2027 ఏప్రిల్‌ వరకు ఎత్తివేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.

వివరాలు

10 లక్షల టన్నుల డీజిల్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో శుక్రవారం ఫోన్‌లో చర్చలు జరిపిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు.

తమ చర్చల్లో భాగంగా మూడు లక్షల టన్నులకు పైగా డీజిల్‌ను అమెరికాకు, అంతర్జాతీయ మార్కెట్‌కు రష్యా తక్షణమే సరఫరా చేసేలా ఒప్పందం కుదిరిందని ట్రంప్‌ తెలిపారు.

ఈ మేరకు తన సోషల్‌ మీడియా వేదిక 'ట్రూత్‌ సోషల్‌'లో పోస్టు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం నవంబరులో మరో ఐదు లక్షల టన్నుల డీజిల్‌ను రష్యా సరఫరా చేయనుందని ట్రంప్‌ వెల్లడించారు.

ఆ తర్వాత వెంటనే అదనంగా మరో 10 లక్షల టన్నుల డీజిల్‌ను అందిస్తుందని పేర్కొన్నారు.

వివరాలు

డీజిల్ సరఫరా చేసే అవకాశం

అనంతరం రష్యాలోని డీజిల్‌ శుద్ధి కర్మాగారాల (రిఫైనరీలు) పరిస్థితులను బట్టి తక్కువ వ్యవధిలోనే మరో 30 లక్షల టన్నుల వరకు డీజిల్‌ సరఫరా చేసే అవకాశం ఉందని వివరించారు.

రష్యా ఇంధన కొనుగోళ్లపై ఆంక్షలు, ఇతర దేశాలపై సుంకాల విధింపు విషయంలో కఠిన వైఖరి అవలంబించిన ట్రంప్‌.. ఇప్పుడు అదే రష్యాతో డీజిల్‌ కొనుగోళ్లకు ఒప్పందం కుదుర్చుకోవడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

అమెరికాలో పెరుగుతున్న ఇంధన ధరలు, రానున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT