Donald Trump: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ప్రస్తుతం 277 ఎలక్టోరల్ ఓట్లతో ట్రంప్ లీడ్‌లో ఉన్నారు. దీంతో ఆయన మద్దతుదారులలో హర్షం వ్యక్తమవుతోంది. పోలింగ్ ముగిసిన అనంతరం, ట్రంప్ ఫ్లోరిడాలోని తన మార్ ఎ లాగో నివాసానికి వెళ్లి, అక్కడే తన మద్దతుదారులకు వాచ్ పార్టీ నిర్వహించి, ఫలితాలను పరిశీలిస్తున్నారు. స్వింగ్ స్టేట్స్ సహా అనేక రాష్ట్రాల్లో తనకు అనుకూలంగా ఫలితాలు వస్తుండటంతో ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పార్టీకి టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక తన మద్దతుదారులతో మాట్లాడేందుకు ట్రంప్ కొద్దిసేపట్లో ఒక ప్రసంగం ఇవ్వనున్నారు.
226 ఎలక్టోరల్ ఓట్లను సాధించిన కమలా హారిస్
ఈ ఎన్నికల్లో గెలిచి అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించాలని ఆశించిన కమలా హారిస్ ఆశలు అడియాసలు అయ్యాయి. ఇప్పటికే ఆమో తన స్పీచ్‌ను కూడా రద్దు చేసుకున్నారు. హోవార్డ్ యూనివర్సిటీలో జరిగిన వాచ్ పార్టీకి భారీ సంఖ్యలో హారిస్ మద్దతుదారులు హాజరయ్యారు. కానీ ఫలితాల్లో హారిస్ వెనకబడ్డటంతో ఆమె మద్దతుదారులు వెనుతిరిగారు. ఇక కమలా హారిస్ ఇప్పటి వరకు 226 ఎలక్టోరల్ ఓట్లను సాధించగా, ట్రంప్ ఇప్పటికే 277 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ ఛానల్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా విజయవంతంగా ఎన్నికయ్యారని ప్రకటించింది.