
Trump Tariffs: బ్రిక్స్ అనుకూల దేశాలపై 10% అదనపు సుంకాలు: ట్రంప్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
వాణిజ్య సుంకాల విషయంలో గట్టి వైఖరి పాటిస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. బ్రిక్స్ (BRICS) పక్షపాత దేశాలపై అదనంగా 10 శాతం సుంకాలను (టారిఫ్‌లు) విధించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తన సోషల్ మీడియా వేదిక అయిన ట్రూత్ సోషల్ (Truth Social) లో ఈ మేరకు ఓ పోస్ట్ చేశారు. "బ్రిక్స్‌కు అనుకూలంగా, అమెరికా వ్యతిరేకంగా విధానాలు పాటిస్తున్న దేశాలతో సంబంధాలు కొనసాగించే ఏ దేశానికైనా 10 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తాం. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు" అని ట్రంప్ తన ప్రకటనలో స్పష్టంగా తెలిపారు.
వివరాలు
అమెరికా ఇతర దేశాలతో చేసే వాణిజ్య ఒప్పందాలపై ట్రంప్ పోస్టు
ప్రస్తుతం బ్రెజిల్ లోని రియో డి జనీరోలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరుగుతుండగా, ఈ సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలు దేశాల నేతలు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా విధానాలపై విమర్శలు వ్యక్తమవడంతో, ట్రంప్ ఈ విధంగా స్పందించినట్లు సమాచారం. అంతేకాకుండా,అమెరికా ఇతర దేశాలతో చేసే వాణిజ్య ఒప్పందాల(ట్రేడ్ డీల్స్) గురించి కూడా ట్రంప్ పోస్టు చేశారు. వాణిజ్య చర్చలపై సోమవారం నుంచే (అమెరికా సమయం ప్రకారం) వివిధ దేశాలకు లేఖలు పంపించనున్నట్లు తెలిపారు. ఈ లేఖల్లో కొత్తగా అమలు చేయనున్న టారిఫ్‌ల గురించి, వాటి అమలుకు సంబంధించి తేదీల గురించి స్పష్టంగా పేర్కొన్నట్లు చెప్పారు.
వివరాలు
జూలై 9 కాదు.. ఆగస్టు 1 నుంచే టారిఫ్‌ల అమలు
కొత్తగా అమలు చేయనున్న ఈ వాణిజ్య సుంకాల (Trump Tariffs) అమలును అమెరికా తాత్కాలికంగా వాయిదా వేసింది. మొదటగా జూలై 9వ తేదీ నుంచి అమలు చేయాలనుకున్నా, తాజా నిర్ణయంతో ఆగస్టు 1నుంచి అమలులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ధ్రువీకరించారు. "ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య ఒప్పందాల రూపకల్పనలో నిమగ్నమై ఉన్నారు. అందువల్ల కొత్త టారిఫ్‌లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి" అని ఆయన ఓ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల అమెరికాతో వాణిజ్య చర్చలు జరపాలనుకునే దేశాలకు మరింత సమయం దొరికినట్లయింది.