
Donald Trump: భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు.. అవసరమైతే జోక్యం చేసుకునేందుకు సిద్ధమన్న ట్రంప్..!
ఈ వార్తాకథనం ఏంటి
భారత సాయుధ దళాలు 'ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్థాన్, పీవోకే (పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్)లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయి.
ఈ చర్యలతో ఉగ్రవాద సంస్థలకు గట్టి దెబ్బ తగిలింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుత పరిస్థితులను శాంతియుతంగా పరిష్కరించేందుకు తన మద్దతును ప్రకటించారు.
అవసరమైతే తానే స్వయంగా జోక్యం చేసుకుంటానని పేర్కొన్నారు. భారత్-పాక్ ఉగ్రదాడుల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగినట్లు ఆయన వ్యాఖ్యానించారు.
వివరాలు
ఏవైనా సహాయ చర్యలు చేపట్టాల్సి వస్తే సిద్ధంగా ఉన్నాం: ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, తాను ఇరుదేశాలతోనూ మంచి సంబంధాలు కలిగి ఉన్నానని, వారికి సంబంధించిన పరిస్థితులు బాగా తెలుసునని చెప్పారు. భారత్, పాకిస్తాన్ లీడర్లు పరస్పరం సమాధానాలను శాంతియుతంగా కనుగొని, తక్షణమే దాడులు నిలిపివేయాలని తాను కోరుకుంటున్నానన్నారు. పరస్పర దాడులు రెండు దేశాలకు నష్టం చేస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఏవైనా సహాయ చర్యలు చేపట్టాల్సి వస్తే సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
వివరాలు
పహల్గాం ఉగ్రదాడిలో 26మంది మృతి
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో తన తొలి స్పందనలో ట్రంప్,"ఈ ఘటన త్వరగా ముగియాలని ఆశిస్తున్నాను. ఇది మంచి పరిణామం కాదు. మేము ఒవల్ ఆఫీస్‌లోకి ప్రవేశిస్తున్నపుడు ఈ విషయాన్ని తెలుసుకున్నాం.కొన్ని వర్గాలు ఇటువంటి దాడి జరిగే అవకాశాన్ని ముందే ఊహించాయి.భారత్, పాకిస్తాన్ శతాబ్దాలుగా ఒకరిపై ఒకరు యుద్ధాలు సాగిస్తూనే ఉన్నారు.ఇప్పుడు అయినా ఈ ఉద్రిక్తతలకు ముగింపు కావాలి,"అని వ్యాఖ్యానించారు.
ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో చోటుచేసుకున్న ఉగ్రదాడిలో 26మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు ఉగ్ర మూకలపై సంయుక్త దాడికి దిగాయి.
లష్కరే తోయిబా(LeT),జైషే మొహమ్మద్(JeM),హిజ్బుల్ ముజాహిదీన్(HM)లాంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది కీలక స్థావరాలను 25 నిమిషాలపాటు జరిపిన ఆపరేషన్‌లో మిస్సైల్ దాడులతో ధ్వంసం చేశారు.
వివరాలు
ప్రధాన మిత్రదేశాల నేతలతో మాట్లాడిన అజిత్ దోవల్
ఈ దాడుల అనంతరం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రపంచంలోని ప్రధాన మిత్రదేశాల నేతలతో మాట్లాడారు.
భారత్ ఈ ఆపరేషన్‌ను ఎందుకు చేపట్టిందన్న విషయాన్ని వారికి వివరించారు.
ఈ నేపథ్యంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మార్కో రూబియో, బ్రిటన్‌కు చెందిన జోనాథన్ పావెల్, సౌదీ అరేబియాకు చెందిన ముసైద్ అల్ ఐబాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన షేక్ తహ్నూన్ బిన్ జాయెద్, అలీ అల్ షంసి, రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ఫ్రాన్స్‌కు చెందిన ఇమ్మాన్యుయల్ బోన్, జపాన్‌కు చెందిన మసటకా ఒకానోలతో అజిత్ దోవల్ మాట్లాడారు.
వివరాలు
వివిధ దేశాల విదేశాంగ మంత్రులతో ఎస్. జైశంకర్ చర్చలు
అలాగే, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల విదేశాంగ మంత్రులతో ఈ విషయమై చర్చలు జరిపారు.
భారత్ చేపట్టిన చర్యలకు గల నేపథ్యాన్ని వారికి వివరించారు.