LOADING...
Trump: ఇరాన్‌తో ఒప్పందానికి చేరువలో ఉన్నాం: ట్రంప్
ఇరాన్‌తో ఒప్పందానికి చేరువలో ఉన్నాం: ట్రంప్

Trump: ఇరాన్‌తో ఒప్పందానికి చేరువలో ఉన్నాం: ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 01, 2026
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్‌తో మంచి ఒప్పందం కుదుర్చుకునే దశకు చేరుకున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే తాము ఆశించిన ఫలితం రాకపోతే పరిస్థితులు మరో రూపం దాల్చవచ్చని హెచ్చరించారు. తొందరపాటుతో ఒప్పందాలు విజయవంతం కావని, అందుకే జాగ్రత్తగా ముందుకు సాగుతున్నామని ట్రంప్ చెప్పారు. తమ లక్ష్యాన్ని నెమ్మదిగా అయినా ఖచ్చితంగా సాధిస్తామని ఆయన వెల్లడించారు. ఇరాన్ నాయకులు చర్చల్లో నైపుణ్యం కలిగిన వారేనని పేర్కొన్న ట్రంప్, సైనిక పరంగా ఆ దేశం బలహీన స్థితిలో ఉందని వ్యాఖ్యానించారు.

వివరాలు 

ఒకవేళ చర్చలు విఫలమైతే..

ఇరాన్ నౌకాదళం, వాయుసేనకు తీవ్ర నష్టం కలిగించామని, అయితే అక్కడి అన్ని సైనిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేయలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం అన్ని అవకాశాలు అమెరికా చేతుల్లోనే ఉన్నాయని, ఒప్పందం కుదిరితే మంచిదేనని చెప్పారు. ఒకవేళ చర్చలు విఫలమైతే అమెరికా యుద్ధ యంత్రాంగం చర్యలు ప్రారంభిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలను ఆయన తన కోడలు లారా ట్రంప్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించగా, ఆ ఇంటర్వ్యూ శనివారం రాత్రి ఫాక్స్ న్యూస్‌లో ప్రసారమైంది.

వివరాలు 

లెబనాన్‌లో వ్యూహాత్మక కోటపై ఇజ్రాయెల్ పట్టు

దక్షిణ లెబనాన్‌లోని కీలక వ్యూహాత్మక పర్వత ప్రాంతాన్ని ఇజ్రాయెల్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. గత పాతికేళ్లలో ఎన్నడూ లేనంతగా లెబనాన్ భూభాగంలోకి ఇజ్రాయెల్ సైన్యం ముందుకు సాగినట్లు సమాచారం. ఈ పర్వతంపై చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఒక కోట ఉంది. గత కొన్ని రోజులుగా సమీప గ్రామాలపై తీవ్ర వైమానిక దాడులు నిర్వహించిన ఇజ్రాయెల్ బలగాలు, తాజాగా ఆ కోటను స్వాధీనం చేసుకున్నాయి. 1982లో కూడా ఇదే కోటను ఇజ్రాయెల్ ఆక్రమించిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Advertisement