
Donald Trump: దక్షిణ కొరియా పర్యటనలో జిన్‌పింగ్‌తో సమావేశానికి ట్రంప్ సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దక్షిణ కొరియా పర్యటనకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సందర్బంగా ఆయన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping)తో భేటీ అయ్యే అవకాశమూ ఉన్నట్లు సమాచారం. దీనిపై పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదికలు ప్రచురించాయి. అక్టోబర్‌లో దక్షిణ కొరియాలో ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) వాణిజ్య మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ట్రంప్ తన పరిపాలనాధికారులతో కలిసి హాజరుకానున్నారని చెబుతున్నారు. జిన్‌పింగ్ కూడా ఈ సమ్మిట్‌లో పాల్గొనే అవకాశముంది. ఈ నేపథ్యంలో ట్రంప్-జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఈ ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకున్న సంగతి తెలిసిందే.
Details
ట్రంప్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం
అదే సమయంలో జిన్‌పింగ్, ట్రంప్ దంపతులు చైనాను సందర్శించాలని ఆహ్వానించగా, ట్రంప్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే, ఇప్పటివరకు ఈ భేటీపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దక్షిణ కొరియా పర్యటనపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని వైట్‌హౌస్ అధికారి తెలిపారు. ఈ సమ్మిట్‌లో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un)తో కూడా ట్రంప్ సమావేశం అయ్యే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అయితే కిమ్ హాజరవుతారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ ఇటీవల ట్రంప్‌ను కలిసి అధికారిక ఆహ్వానం అందించారు.
Details
కిమ్ ను కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం
ఆ సందర్భంగా కిమ్‌ను కలిసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ''మేం చర్చలు జరుపుతాం. అతన్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నాను. సంబంధాలు మెరుగుపరుచుకుంటాం'' అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలుసుకున్న విషయం తెలిసిందే. ఈ భేటీపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసి, ఆ మూడు దేశాలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.