
USA Education: విద్యార్థుల అడ్మిషన్ల డేటా ఇవ్వాల్సిందే.. ఆదేశాలు జారీ చేసిన ట్రంప్ కార్యవర్గం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా విశ్వవిద్యాలయాలు (USA Universities),ఇతర విద్యాసంస్థలను శ్వేతజాతీయుల ప్రయోజనాలకు అనుకూలంగా మార్చే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అమెరికా విద్యాసంస్థలు తమ విద్యార్థుల జాతి, లింగం, టెస్ట్ స్కోర్లు, అలాగే గ్రేడ్ పాయింట్ల సగటు వంటి వివరాలను తప్పనిసరిగా అక్కడి విద్యాశాఖకు సమర్పించాల్సి ఉంటుంది అని ఆదేశించింది. ఈ మేరకు ట్రంప్ గురువారం అధికారిక ఆదేశాలు జారీ చేశారు.
వివరాలు
విద్యాసంస్థల్లో వామపక్ష భావజాల ప్రభావాన్ని తగ్గించడానికి జరుగుతున్న చర్య..
ఈ నిర్ణయం ద్వారా కాలేజీలు, విశ్వవిద్యాలయాలు మైనారిటీ విద్యార్థులకు అనవసరంగా అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయా అన్న విషయాన్ని గమనించాలనే ఉద్దేశ్యం ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 2023లో అమెరికా సుప్రీంకోర్టు, కాలేజీ అడ్మిషన్లలో జాతి ఆధారిత ఎంపిక (Race-based admissions)ను వ్యతిరేకిస్తూ ఇచ్చిన తీర్పును, కొంతమంది విద్యాసంస్థలు పక్కదోవ పట్టిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితిని అరికట్టేందుకు, అలాగే ఆ తీర్పు అమలు కావాలంటూ దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్న అమెరికా సంప్రదాయవాద వర్గాల ఆకాంక్షను నెరవేర్చేందుకు ఈ చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు. విద్యాసంస్థల్లో వామపక్ష భావజాల ప్రభావాన్ని తగ్గించడానికి జరుగుతున్న చర్యల్లో భాగంగానే దీన్ని కూడా చూస్తున్నారు.
వివరాలు
అమెరికా విద్యాసంస్థల్లో బ్లాక్,బ్రౌన్ వర్ణ విద్యార్థుల ప్రవేశాన్ని అడ్డుకోవడానికే ఈ చర్య: జస్టిన్ డ్రైవర్
న్యాయనిపుణుల అంచనాల ప్రకారం, ఈ కొత్త విధానం జాతి ఆధారంగా అడ్మిషన్లు ఇస్తున్న అనేక విశ్వవిద్యాలయాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ విషయంలో యేల్ లా స్కూల్ ప్రొఫెసర్ జస్టిన్ డ్రైవర్ స్పందిస్తూ.. ట్రంప్ ప్రభుత్వపు విద్యా వ్యవస్థపై జరుగుతున్న దాడిలో ఇది మరో తీవ్రమైన, వినాశకర పరిణామమని వ్యాఖ్యానించారు. అమెరికా విద్యాసంస్థల్లో బ్లాక్,బ్రౌన్ వర్ణ విద్యార్థుల ప్రవేశాన్ని అడ్డుకోవడానికే ఈ చర్య తీసుకున్నారని ఆయన అన్నారు. అంతేకాక, మైనారిటీ విద్యార్థులను చేర్చుకోవడానికి యూనివర్శిటీలపై ఒత్తిడి చేయకుండా, వాటిని బెదిరించే సాధనంగా ఈ విధానాన్ని ట్రంప్ కార్యవర్గం ఉపయోగిస్తోందని విమర్శించారు.
వివరాలు
కొత్త నిబంధనల కారణంగా వీసా జారీ ప్రక్రియలో ఆలస్యం
ఇప్పటికే ట్రంప్ తీసుకొచ్చిన పలు విద్యా విధానాలను అమెరికా కోర్టుల్లో సవాల్ చేశారు. హార్వర్డు విశ్వవిద్యాలయానికి సంబంధించిన కేసులో కూడా ఇలాంటి వివాదం చోటుచేసుకుంది. తాజాగా గురువారం ప్రకటించిన కొత్త మార్గదర్శకాలతో, అక్కడి విద్యాశాఖకు స్కూల్స్, ఇతర విద్యాసంస్థలపై మరింత బలమైన నియంత్రణాధికారాన్ని ఇచ్చినట్లైంది. ఇకపోతే, ఉన్నత విద్య కోసం అమెరికా ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే అడ్మిషన్ పొందిన అంతర్జాతీయ విద్యార్థులు ఈ నిర్ణయాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త నిబంధనల కారణంగా వీసా జారీ ప్రక్రియలో (USA Visa delays) గణనీయమైన ఆలస్యం జరుగుతోంది. ఫలితంగా, విద్యా సంవత్సరం మొదలైనప్పటికీ తరగతులకు హాజరుకాలేకపోతున్న పరిస్థితి ఏర్పడింది. దీనిపై అనేక మంది విదేశీ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.