Trump-Putin: రష్యా అధ్యక్షుడితో డోనాల్డ్ ట్రంప్ సీక్రెట్ ఫోన్ కాల్స్..!
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు మరికొన్ని వారాల్లో జరగనున్న వేళ, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గురించి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ట్రంప్ రహస్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)తో టచ్‌లో ఉన్నారని తెలిసింది. కొవిడ్ సమయంలో సీక్రెట్‌గా టెస్టు కిట్లు కూడా పంపించారట. ఈ విషయాలను అమెరికాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ తన పుస్తకంలో పేర్కొన్నారు.
ట్రంప్, పుతిన్ కనీసం 7 సార్లు రహస్యంగా మాట్లాడుకున్నారు
'వార్' పేరుతో జర్నలిస్ట్ బాబ్ వూడ్‌వర్డ్ రాసిన ఈ పుస్తకం అక్టోబర్ 15న విడుదల కానుంది. ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్యాంశాలు ఇప్పటికే అమెరికా మీడియా సంస్థల్లో ప్రచురితమయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ తన ఫ్లోరిడా ఎస్టేట్ నుంచి పుతిన్‌తో అత్యంత రహస్యంగా ఫోన్ కాల్ మాట్లాడినట్లు బాబ్ వూడ్‌వర్డ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. ఆ సమయంలో ట్రంప్ తన గదిలో ఎవరూ ఉండొద్దని తన సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు. 2021లో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పటి నుంచి ట్రంప్, పుతిన్ కనీసం 7 సార్లు రహస్యంగా మాట్లాడుకున్నారని ఈ పుస్తకంలో తెలిపారు.
పుతిన్ కోసం సీక్రెట్‌గా కొవిడ్ టెస్టు కిట్లు
అంతేకాక, అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్ పుతిన్ కోసం సీక్రెట్‌గా కొవిడ్ టెస్టు కిట్లను పంపినట్లు కూడా బాబ్ వెల్లడించారు. 2020లో కొవిడ్ వ్యాప్తి సమయంలో టెస్టు కిట్ల కొరత విపరీతంగా ఉన్నప్పుడు, పుతిన్ వ్యక్తిగత వినియోగం కోసం కొన్ని టెస్టు కిట్లను ట్రంప్ గిఫ్ట్‌గా పంపినట్లు తెలిపారు. అయితే, ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలన్న పుతిన్ అభ్యర్థనతో ట్రంప్ అంగీకరించారని బాబ్ వూడ్‌వర్డ్ పేర్కొన్నారు. ఈ విషయం బయటకు చెబితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పుతిన్ హెచ్చరించారని కూడా వివరించారు.
చర్చనీయాంశంగా రహస్య సంబంధాలు
ఇప్పుడు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఈ రహస్య సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్-పుతిన్ మధ్య బంధం గురించి చెప్పనక్కర్లేదు. గతంలో కూడా ట్రంప్ రష్యా అధ్యక్షుడిని బహిరంగంగా ప్రశంసించారు. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తర్వాత పుతిన్‌ను 'జీనియస్' అని అభివర్ణించిన ట్రంప్ ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న సాయాన్ని విమర్శిస్తూ, వాటిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఒక రోజులోనే ముగిస్తానని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ క్రమంలో ప్రస్తావనకు వచ్చాయి.