Kamala Harris: కమలా హారిస్ ర్యాలీలో ట్రంప్ మద్దతుదారుల అల్లర్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రజల మద్దతు పొందడానికి వారు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా, టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో కమలా హారిస్ పాల్గొన్నారు. అయితే, హ్యూస్టన్‌లో రిపబ్లికన్ల సంఖ్య అధికం కావడంతో ఆమెకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. హారిస్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు, ట్రంప్ మద్దతుదారులు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలను సృష్టించారు. దీంతో ఆమె ఆగ్రహించారు.
నవంబర్ 5న ఎన్నికలు
అనంతరం డెమోక్రాట్లు హారిస్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ ఆందోళనకారులను అక్కడి నుండి పంపేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కమలాహారిస్‌కు విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని వివిధ సర్వేలు సూచిస్తున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో కమలాహారిస్, డొనాల్డ్ ట్రంప్, అమెరికాలోని పలు కీలక అంశాలపై విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అబార్షన్ హక్కుల నుండి నానాటికీ పెరుగుతున్న తుపాకీ సంస్కృతి నిర్మూలన వరకు, వారు తమ ప్రసంగాల్లో పలు హామీలు ఇస్తున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న 2.1 కోట్ల మంది ప్రజలు
అంతేకాకుండా, అమెరికాలో ఇటీవల నిర్వహించిన ముందస్తు ఎన్నికల్లో దాదాపు 2.1 కోట్ల మంది ప్రజలు ఓటుహక్కును వినియోగించుకున్నట్లు ఫ్లోరిడా యూనివర్సిటీ ఎలక్షన్ ల్యాబ్ వెల్లడించింది. నవంబర్ 5న దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో, ముందస్తు పోలింగ్ సౌకర్యాన్ని 78 లక్షల మంది వినియోగించుకున్నారు. మెయిల్ బ్యాలెట్ ద్వారా మరో 1.33 కోట్ల మంది ఓటేశారు.