Page Loader
Donald Trump:'యుద్ధం ముగింపుపై 50 రోజుల్లోపు ఓ ఒప్పందానికి రాని పక్షంలో'.. రష్యాకు ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు! 
రష్యాకు ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు!

Donald Trump:'యుద్ధం ముగింపుపై 50 రోజుల్లోపు ఓ ఒప్పందానికి రాని పక్షంలో'.. రష్యాకు ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 15, 2025
07:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌ యుద్ధ ముగింపు అంశంలో రష్యా వైఖరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తీవ్రంగా స్పందించారు. యుద్ధం ముగింపుకు 50 రోజుల్లో ఒప్పందానికి రాకపోతే భారీ సుంకాలు విధించి శిక్షిస్తానని హెచ్చరించారు. ఓవల్‌ ఆఫీస్‌లో నాటో (NATO) సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుట్టేతో జరిగిన సమావేశంలో ట్రంప్‌ ఈ ప్రకటన చేశారు. యుద్ధాలను ముగించేందుకు తాను వాణిజ్య విధానాన్ని ప్రయోగిస్తానని వెల్లడించారు. ఇది మంచి ఫలితాలు ఇస్తుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మాస్కోపై సుంకాలు ఏ విధంగా అమలు చేయనున్నారన్న దానిపై మాత్రం ట్రంప్‌ స్పష్టత ఇవ్వలేదు.

వివరాలు 

ఉక్రెయిన్‌కు పేట్రియాట్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌

నాటోకు అత్యాధునిక ఆయుధాలు అందించనున్నట్లు ట్రంప్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు పంపిణీ చేయడం నాటో ఆధ్వర్యంలో కొనసాగుతుందని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్‌, రష్యాల మధ్య పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్‌ ప్రత్యేక ప్రతినిధి, విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ కీథ్‌ కెలాగ్‌ సోమవారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని కలిశారు. ఆయుధాల కొనుగోలు, రష్యాపై ఆంక్షలు తదితర అంశాలపై జరిగిన చర్చలు సానుకూలంగా జరిగాయని జెలెన్‌స్కీ ప్రకటించారు. మాస్కోతో దీర్ఘకాలంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మరింత ఆయుధ సహాయాన్ని అందించేందుకు ట్రంప్‌ ముందుగా అంగీకరించిన విషయాన్ని జెలెన్‌స్కీ గుర్తుచేశారు. ఇందుకు భాగంగా పేట్రియాట్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను అందజేయనున్నట్లు ట్రంప్‌ ఇప్పటికే వెల్లడించారు.