Page Loader
Donald Trump: ఆ నిర్ణయం వెనక్కి తీసుకోండి.. లేదంటే..!. 50 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తామని హెచ్చరించిన ట్రంప్
ఆ నిర్ణయం వెనక్కి తీసుకోండి.. లేదంటే..

Donald Trump: ఆ నిర్ణయం వెనక్కి తీసుకోండి.. లేదంటే..!. 50 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తామని హెచ్చరించిన ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2025
10:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా,చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. ఈ మధ్యకాలంలో చైనా తీసుకున్న కీలక నిర్ణయం ప్రకారం, అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని వస్తువులపై 34 శాతం అదనపు సుంకాన్ని విధించబోతోంది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. చైనా ఏప్రిల్ 8లోగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. అప్పటికి వెనక్కి తీయకపోతే, ఏప్రిల్ 9 నుంచి చైనా దిగుమతులపై 50 శాతం వరకు ప్రతీకార సుంకాలను విధిస్తామన్నారు. అంతేకాకుండా, చైనాతో సాగుతున్న అన్ని వాణిజ్య చర్చలను రద్దు చేస్తామన్న హెచ్చరికను కూడా ఇచ్చారు.

వివరాలు 

ఏప్రిల్ 9 నుంచి 50 శాతం టారిఫ్‌లు అమలులోకి..

ట్రంప్‌ ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ - ''చైనా ఇప్పటికే అమెరికాపై భారీగా టారిఫ్‌లు విధిస్తోంది. అలాగే అక్కడి ప్రభుత్వం తమ కంపెనీలకు అన్యాయమైన రాయితీలు ఇస్తోంది, కరెన్సీని కృత్రిమంగా నెమ్మదిగా మారుస్తోంది. నేను హెచ్చరించినప్పటికీ, అమెరికాను ప్రతీకారంగా లక్ష్యంగా చేసుకుంటూ అదనపు సుంకాలు విధించడాన్ని మేము సహించము. ఒకవేళ అలాంటి చర్యలు కొనసాగితే, మేము మొదట ప్రకటించినదానికంటే ఎక్కువ స్థాయిలో టారిఫ్‌లు విధిస్తాం. కాబట్టి, చైనా ఏప్రిల్ 8లోగా తమ తాజా 34 శాతం అదనపు సుంకాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే, ఏప్రిల్ 9 నుంచి 50 శాతం టారిఫ్‌లు అమలులోకి వస్తాయి. చర్చలు కూడా నిలిపివేస్తాం'' అని స్పష్టం చేశారు.

వివరాలు 

అమెరికాకు చెందిన 16 కంపెనీల ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం 

ఇంతకుముందు ట్రంప్‌ చైనాపై 34 శాతం ప్రతీకార సుంకాలు ప్రకటించిన నేపథ్యంలో, చైనా కూడా తక్షణమే ప్రతిస్పందించింది. అమెరికాకు చెందిన 16 కంపెనీల ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధాన్ని ప్రకటించింది. ఇవి ప్రధానంగా రక్షణ, కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ రంగాల్లో ఉపయోగపడే డ్యూయల్-యూజ్‌ వస్తువులు కావడం గమనార్హం. అంతేకాక, అరుదైన ఖనిజాల ఎగుమతులపై నియంత్రణలు విధించి, అమెరికా పరిశ్రమలకు దెబ్బతీయాలనే విధంగా చర్యలు తీసుకుంది. పైగా, ఈ ప్రతీకార టారిఫ్‌లపై ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో కేసును కూడా దాఖలు చేసింది. చైనాకు వ్యతిరేకంగా ఇప్పటికే విమర్శలు చేసిన ట్రంప్‌.. తాజాగా ప్రతీకార సుంకాలను మరింత పెంచుతానంటూ స్పష్టం చేశారు.