Donald Trump: అమెరికా మిలిటరీ నుండి ట్రాన్స్‌జెండర్లను తొలగిస్తూ ట్రంప్ 'ఎగ్జిక్యూటివ్ ఆర్డర్'పై సంతకం
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత, డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో,అమెరికా ఆర్మీలో ఉన్న ట్రాన్స్‌జెండర్‌లపై కీలక చర్యలు తీసుకోవాలని ఆయన యోచిస్తున్నట్లు ది సండే టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. ప్రమాణస్వీకారం అనంతరం, ట్రాన్స్‌జెండర్‌లను తొలగించే ఫైల్‌పై ట్రంప్ సంతకం చేయబోతున్నట్లు ఆ కథనం వెల్లడించింది. ప్రస్తుతం ఆర్మీకి కొత్త నియామకాలు తక్కువగా ఉన్న తరుణంలో ట్రాన్స్‌జెండర్‌లను తొలగించడం వివాదాస్పద అంశంగా మారింది. ఆధునిక ఆర్మీ అవసరాలకు ట్రాన్స్‌జెండర్‌లు తగిన విధంగా సేవలు అందించడం లేదని ట్రంప్ నిర్ణయాన్ని మద్దతు ఇచ్చే వారు అంటున్నారు. ఈ విషయంపై వారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
ఆ ఆదేశాలను రద్దు చేసిన జో బైడెన్
ఇదిలా ఉంటే, ట్రాన్స్‌జెండర్‌లను ఆర్మీ నుంచి తొలగించే ముందు వారికి అన్ని గౌరవాలు ఇచ్చి పంపించనున్నట్లు సమాచారం. ట్రంప్ తన తొలి పదవీకాలంలో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. అయితే, ఆ సమయంలో ట్రాన్స్‌జెండర్‌లను కొత్తగా ఆర్మీలో నియమించడాన్ని మాత్రమే నిషేధించారు, కానీ అప్పటికే సేవలో ఉన్నవారిని కొనసాగించాలని ఆదేశించారు. జో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఆదేశాలను రద్దు చేశారు. కాగా, నవంబర్ 5న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.