
Donald Trump: ఆందోళనకారులకు ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. బలప్రయోగం తప్పదన్న అధ్యక్షుడు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా సైన్యం 250వ వార్షికోత్సవం సందర్భంగా వాషింగ్టన్‌లో శనివారం నిర్వహించబోయే సైనిక కవాతుకు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని భావిస్తున్నవారిపై తీవ్రంగా బలప్రయోగం చేయాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇలాంటి నిరసనలను ప్రోత్సహించే వారు దేశాన్ని ద్వేషించే మనస్థత్వంతో ఉన్నవారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్ నార్త్ కరోలినాలోని ఫోర్ట్ బ్రాగ్‌లో జరిగిన సైనిక దళాల 250వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా చేశారు. ఈ వేడుకలు శనివారం జరిగే సైనిక పరేడ్‌తో ముగియనున్నాయి.అదే రోజున ట్రంప్ 79వ పుట్టినరోజు కూడా జరుపుకుంటున్నారు.
వివరాలు
ఫోర్ట్ బ్రాగ్‌లో వేడుక
ఫోర్ట్ బ్రాగ్‌లో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా అమెరికా సైన్యం క్షిపణి దాడులు,హెలికాప్టర్ దాడులు, అలాగే భవనంపై జరిగిన ఓ మాక్ దాడిని ప్రదర్శించింది. ఈ కార్యక్రమాలను ట్రంప్ ప్రత్యక్షంగా వీక్షించారని సిన్హువా వార్తా సంస్థ నివేదించింది. వాషింగ్టన్ బయలుదేరే ముందు, ట్రంప్ ఓవల్ ఆఫీస్‌లో మాట్లాడుతూ, పరేడ్‌కు వ్యతిరేకంగా జరిగే నిరసనల విషయంలో ఎటువంటి తేడా లేకుండా తీవ్ర బలంతో స్పందిస్తామని అన్నారు. శాంతియుత నిరసనలు అయినా, హింసాత్మక సంఘటనలైనా తాము ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై న్యూయార్క్ టైమ్స్ స్పందిస్తూ - ట్రంప్ హింసాత్మక ఘటనలు, శాంతియుత నిరసనల మధ్య తేడా చూపకుండా హెచ్చరికలు జారీ చేశారని పేర్కొంది.
వివరాలు
లాస్ ఏంజెలెస్‌లో నిరసనల అణచివేతను సమర్థించిన అమెరికా అధ్యక్షుడు
"మేము ప్లాన్ చేసిన ఈ అద్భుతమైన రోజున ఎవరైనా అడ్డుపడాలనుకుంటే వారిని పెద్ద బలంతో ఎదుర్కొంటాం" అని ట్రంప్ స్పష్టం చేశారు. "ఇటివరకు నిరసనల గురించి నాకు స్పష్టమైన సమాచారం రాలేదు, కానీ ఇలాంటి కార్యకలాపాలు ఎక్కువగా దేశాన్ని ద్వేషించే వారివల్ల జరుగుతాయి. వారిని మనం ఉత్సాహంగా కానీ, చాలా గట్టిగా కానీ ఎదుర్కొంటాం" అని ఆయన చెప్పారు. ఇంతకుముందు, ట్రంప్ పరిపాలన లాస్ ఏంజెలెస్‌లో జరిగిన ఫెడరల్ ఇమిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలపై వేలాది మంది నేషనల్ గార్డ్, మెరైన్లను మోహరించినందుకుగాను తన చర్యలను సమర్ధించుకుంది. కొద్దిసేపటికే ట్రంప్ ఈ కొత్త హెచ్చరికలు ఇచ్చారు.
వివరాలు
యాపిల్ స్టోర్‌లలో దోపిడీలు
ఈ నిరసనల సమయంలో కార్లు తగలబెట్టడం, అధికారులపై కాంక్రీట్ ముక్కలు విసరడం, యాపిల్ స్టోర్‌లలో దోపిడీలు జరగడం వంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని నివేదిక పేర్కొంది. అయితే, ట్రంప్ వలస విధానాలను వ్యతిరేకించే కాలిఫోర్నియాలో జరిగిన నిరసనల్ని మద్దతు ఇచ్చే వారు మాత్రం వీటిని చాలా వరకు శాంతియుతంగా నిర్వహించామని స్పష్టం చేశారు. కానీ ట్రంప్ మద్దతుదారులు, పరిపాలన వర్గాలు ఈ చిన్నపాటి హింసాత్మక ఘటనలను పెంచి చూపిస్తున్నారని వారు ఆరోపించారు.