
Donald Trump: 'నాకు తెలియదు..తెలుసుకోవాలి'.. రష్యా చమురు కొనుగోళ్లుపై ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా రష్యా నుంచి యురేనియం, ఎరువులు దిగుమతి చేసుకుంటోందన్న విషయాన్ని గురించి తనకు తెలియదని వెల్లడించారు. భారత్ ఈ అంశాన్ని ప్రస్తావించడంతో ఇది చర్చకు వచ్చింది. మాస్కోతో చమురు వ్యాపారం కొనసాగించడంపై పశ్చిమ దేశాల విమర్శల్ని తిప్పికొట్టేందుకు భారత్ ఈ అంశాన్ని ఉపయోగించింది. "ఆ విషయం గురించి నాకు ఏమీలేదు. నేను దాన్ని చెక్ చేసుకోవాలి," అంటూ ట్రంప్ చెప్పారు. భారత్‌ను అన్యాయంగా టార్గెట్ చేస్తున్న అమెరికా, అదే సమయంలో రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తోందని అభిప్రాయపడిన నేపథ్యంలో ఆయన ఇలా స్పందించారు.
వివరాలు
భారత్ కొనుగోలు చేసే ఇంధనం అంతా ఆర్థిక అవసరాల ఆధారంగానే..
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసి, రష్యా చమురు దిగుమతులపై భారత్‌ను విమర్శించడాన్ని "పక్షపాతపూరితమైనది, అన్యాయమైనది" అని తప్పుబట్టింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ భారత్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నప్పటికీ, తామే రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్ (nuclear industry కోసం), పల్లాడియం (EV పరిశ్రమ కోసం), ఎరువులు, రసాయనాలు కొనుగోలు చేస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారని పేర్కొంది. భారత్ కొనుగోలు చేసే ఇంధనం అంతా ఆర్థిక అవసరాల ఆధారంగానే జరుగుతోందని MEA స్పష్టం చేసింది. అంతేగాక, గతంలో అమెరికానే భారత్‌ను రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయమని ప్రోత్సహించిందని కూడా గుర్తుచేసింది.
వివరాలు
రష్యా చమురుతో వ్యాపారం చేస్తే టారిఫ్‌లు పెంచుతానంటూ ట్రంప్ హెచ్చరిక
ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ భారత్‌పై ఒత్తిడి పెంచారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపకపోతే, భారత్‌పై అదనపు టారిఫ్‌లు (దిగుమతి సుంకాలు) విధిస్తామని హెచ్చరించారు. "భారత్ మనతో చాలా వ్యాపారం చేస్తుంది. కానీ మనం వారితో అంతగా వ్యాపారం చేయము. అందుకే ఇప్పటివరకు 25% టారిఫ్ పెట్టాం. కానీ ఇప్పుడు వాళ్లు రష్యా చమురు కొనుగోలు చేస్తున్నారనేదే ప్రధాన సమస్య. దాని వలన ఉక్రెయిన్‌పై జరిగే యుద్ధానికి పరోక్షంగా మద్దతు లభిస్తోంది. అందుకే 24 గంటల్లోనే భారీగా టారిఫ్ పెంచే ఆలోచనలో ఉన్నాను," అంటూ ట్రంప్ CNBC ఇంటర్వ్యూలో అన్నారు. ఇంకా స్పష్టంగా చెప్పకపోయినా, ట్రంప్ 100% టారిఫ్ విధించే అవకాశాన్ని కొట్టిపారేయలేదు.
వివరాలు
రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్న దేశాలపై 100% టారిఫ్
"నేను 100శాతం ఏదీ చెప్పలేదు కానీ..మేము అలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి దగ్గరలోనే ఉంది. రేపే రష్యాతో మాకు ఒక సమావేశం ఉంది. దానిపై ఎలాంటి పరిణామాలు వస్తాయో చూద్దాం," అన్నారు. ఈ సమావేశం ఉద్దేశ్యం రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా చర్చలు జరిపేలా ఉండనుంది. "ఈ యుద్ధాన్ని ఆపడానికే నేను ఎక్కువగా శ్రమిస్తున్నాను. మిగతా యుద్ధాలు కొద్ది రోజుల్లోనే ఆగిపోయాయి. కానీ ఇది ఇంకా కొనసాగుతోంది," అని ట్రంప్ చెప్పారు. రష్యా మీదా,రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాల మీదా టారిఫ్‌లు విధించాలా వద్దా అనే నిర్ణయం మాస్కోలో జరుగనున్న చర్చలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ చర్చల కోసం అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ బుధవారం రష్యా నాయకులతో సమావేశం కానున్నారు.