Pakistan: కరాచీలో కాల్పులు.. ఇద్దరు చైనా పౌరులకు గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
గత కొంత కాలంగా పాకిస్థాన్ లో చైనీయులపై దాడులు పెరుగుతున్నాయి. ఈ దాడుల కారణంగా చాలా మంది చైనా పౌరులు మరణించారు.
తాజాగా, మరోసారి చైనీయులను లక్ష్యంగా చేసుకుంటూ కాల్పులు చోటుచేసుకున్నాయి.
పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఈ కాల్పులలో ఇద్దరు చైనా పౌరులు గాయపడినట్లు సమాచారం.
వివరాలు
ఒకరి పరిస్థితి విషమం
ఇద్దరు చైనా పౌరులపై దాడి జరిగిందని సీనియర్ పోలీసు అధికారి ఫైజల్ అలీ వెల్లడించారు, కానీ దాడి వెనుక ఉన్న వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.
గాయపడిన వారికి చికిత్స అందజేస్తున్నట్లు తెలిపారు, అయితే ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
అక్టోబర్ నెలలో కూడా కరాచీ జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు చైనీయులు మరణించారు.
బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఈ దాడికి బాధ్యత స్వీకరించింది.
ఈ గ్రూప్ బలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతోంది, ముఖ్యంగా సీపెక్ ప్రాజెక్టులో పనిచేస్తున్న చైనీయులను లక్ష్యంగా చేసుకుంటోంది.