Miami International Airport: అమెరికా విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీ.. తప్పిన పెను ప్రమాదం!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయం (MIA)లో శనివారం రాత్రి రెండు విమానాలు ఢీకొన్నాయి. యూపీఎస్ కార్గో విమానం, కోపా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్యాసింజర్ జెట్ ఒకదానికొకటి తగిలాయి. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:15 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ల్యాండింగ్‌కు వస్తున్న విమానం, టేకాఫ్‌కు సిద్ధమవుతున్న మరో విమానం రెండు ట్యాక్సీవేల కూడలిలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, స్వల్పంగా గాయపడిన ఇద్దరికి మియామి-డేడ్ ఫైర్ రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలంలోనే చికిత్స అందించారు.
వివరాలు
దేశవ్యాప్త విమానాల నిలిపివేత తర్వాత ఘటన
అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) శుక్రవారం దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసిన ఘటన నుంచి మియామి విమానాశ్రయం ఇంకా పూర్తిగా కోలుకోకముందే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పాతబడిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సాంకేతిక వ్యవస్థల్లో సమస్యలు తలెత్తడంతో రాడార్, కమ్యూనికేషన్ వ్యవస్థల్లో అంతరాయాలేర్పడ్డాయి.
దీంతో FAA ఈ నిర్ణయం తీసుకుంది. విమానయాన కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుందని రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ ముందుగానే హెచ్చరించారు.
విమానాలు, సిబ్బందిని తిరిగి వివిధ ప్రాంతాలకు సర్దుబాటు చేయాల్సి ఉండటంతో కార్యకలాపాలు పునరుద్ధరించడానికి సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
యూపీఎస్, కోపా ఎయిర్‌లైన్స్ విమానాల వివరాలు
ఈ ఘటనలో ఢీకొన్న యూపీఎస్ ఫ్లైట్ 358 బోయింగ్ 767 విమానం. ఇది మియామి నుంచి కొలంబియాలోని బొగోటాకు వెళ్లాల్సి ఉంది.
మరోవైపు కోపా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 427 బోయింగ్ 737 విమానం పనామాలోని పనామా సిటీ నుంచి మియామికి వస్తోంది.
ఈ ప్రమాదం విమానాశ్రయ కార్యకలాపాలపై ప్రభావం చూపలేదని మియామి అంతర్జాతీయ విమానాశ్రయ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ తెలిపారు.
విమానాలను ప్రస్తుతం ఇతర ట్యాక్సీవేల మీదుగా మళ్లిస్తున్నట్లు CBS న్యూస్ మియామికి వెల్లడించారు.