Illegal Migration: అక్రమ వలసదారులపై యూకే ఉక్కుపాదం.. ప్రధాని స్టార్మర్ కఠిన నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక చట్టవ్యతిరేకంగా దేశంలోకి ప్రవేశించిన వలసదారులపై కఠిన చర్యలు తీసుకున్నారు.
వారిని నిర్బంధించడంతో పాటు, సైనిక విమానాల ద్వారా స్వదేశాలకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాజాగా యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) కూడా ఇదే బాటలో నడుస్తోంది.
అక్రమంగా దేశంలోకి ప్రవేశించి ఉపాధి పొందుతున్న 600 మందికి పైగా వలసదారులను అరెస్టు చేసింది.
Details
యూకేలో అక్రమ వలసలపై స్టార్మర్ ఆగ్రహం
ఈ వ్యవహారంపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్ స్పందించారు. 'యూకేలో అక్రమ వలసలు అధికమయ్యాయని, చాలా మంది చట్టవ్యతిరేకంగా ఇక్కడ పనులు చేస్తున్నారన్నారు.
అక్రమ వలసలకు ముగింపు పలుకుతామంటూ తన 'ఎక్స్' ఖాతాలో పోస్టు చేశారు.
గతేడాది జులైలో లేబర్ పార్టీ బ్రిటన్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కీర్ స్టార్మర్ ప్రభుత్వం బోర్డర్ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో ఇమ్మిగ్రేషన్ విభాగం అధికారులు వందలాది మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారు.
Details
4 వేల మంది అక్రమ వలసదారుల పట్టివేత
బార్‌లు, రెస్టారెంట్లు, కార్ వాషింగ్ కేంద్రాలు, ఇతర స్టోర్లలో అక్రమంగా పని చేస్తున్న వలసదారులను గుర్తించేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు.
దాదాపు 828 ప్రాంగణాల్లో తనిఖీలు నిర్వహించి, 609 మందిని అరెస్టు చేశారు.
గతేడాది జులై నుండి ఇప్పటివరకు మొత్తం 4 వేల మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు యూకే హోంశాఖ గణాంకాలు వెల్లడించాయి.
ఉద్యోగాల ఆశతో వలసదారులు ప్రమాదకర మార్గాల్లో యూకేకు చేరుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. కొందరిని క్రిమినల్ గ్యాంగ్‌లు అక్రమ మార్గాల్లో దేశంలోకి తీసుకువచ్చినట్లు గుర్తించారు.
మరికొందరు ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదుకుంటూ యూకేలోకి ప్రవేశించినట్లు తనిఖీల్లో బయటపడింది.
Details
త్వరలో కీలక నిర్ణయం
ఈ వలసదారులను స్వదేశాలకు తరలించే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు యూకే అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో అక్రమ వలసదారుల అడ్డగింత, సరిహద్దు భద్రత, శరణార్థులకు సంబంధించిన బిల్లుపై యూకే పార్లమెంట్‌లో త్వరలో చర్చ జరగనుంది.