
Illegal Migration: వలసదారులపై బ్రిటన్ కఠిన చర్యలు.. భారతీయ రెస్టరంట్‌లే లక్ష్యం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా తరహాలోనే, బ్రిటన్ ప్రభుత్వం అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేకంగా భారతీయ రెస్టారెంట్లను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 'యూకే వైడ్ బ్లిట్జ్' పేరుతో వలసదారులు పని చేస్తున్న భారతీయ రెస్టారెంట్లలో భారీ స్థాయిలో సోదాలు నిర్వహించింది. అదనంగా, కార్ వాష్ ప్రాంతాలు, కన్వీనియెన్స్ స్టోర్లు, బార్లపై తనిఖీలు చేపట్టి వందల మందిని అరెస్ట్ చేసింది. హంబర్‌సైడ్ ప్రాంతంలోని ఒక భారతీయ రెస్టారెంట్‌లో నిర్వహించిన సోదాల్లో, చట్ట విరుద్ధంగా పనిచేస్తున్న ఏడుగురిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. అదనంగా,మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సౌత్ లండన్‌లోని ఒక భారతీయ గ్రాసరీ వేర్‌హౌస్‌లో తనిఖీలు నిర్వహించి, ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు బ్రిటన్ హోంశాఖ అధికారులు ప్రకటించారు.
వివరాలు
అక్రమ వలసలను పూర్తిగా అడ్డుకుంటాం: కైర్ స్టార్మర్
అక్రమ వలసదారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడాన్ని అడ్డుకోవడమే ప్రభుత్వ కఠిన చర్యల ఉద్దేశం అని యూకే సర్కారు స్పష్టం చేసింది. ఈ చర్యల భాగంగా, జనవరిలో మొత్తం 828 ప్రాంగణాల్లో తనిఖీలు నిర్వహించి, 609 మంది అక్రమంగా పనిచేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ కూడా ఈ అంశంపై స్పందించారు. 'బ్రిటన్‌లో అక్రమ వలసలు అధికంగా పెరిగాయి. చాలామంది చట్ట విరుద్ధంగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ అక్రమ వలసలను పూర్తిగా అడ్డుకుంటాం' అని ప్రధాని ప్రకటించారు.