Page Loader
Afghanistan: పురుషులపైనా తాలిబన్ల ఛాందసం.. ఆధునిక కేశాలంకరణ చేసినా అరెస్టులే.. ఐక్యరాజ్యసమితి నివేదిక
పురుషులపైనా తాలిబన్ల ఛాందసం.. ఆధునిక కేశాలంకరణ చేసినా అరెస్టులే

Afghanistan: పురుషులపైనా తాలిబన్ల ఛాందసం.. ఆధునిక కేశాలంకరణ చేసినా అరెస్టులే.. ఐక్యరాజ్యసమితి నివేదిక

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 11, 2025
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ పాలన కేవలం మహిళలకే కాకుండా ఇప్పుడు పురుషులకూ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది అని ఐక్యరాజ్య సమితి గురువారం విడుదల చేసిన తాజా నివేదిక పేర్కొంది. ఇప్పటివరకు మహిళలపై కఠిన నియంత్రణలతో గుర్తింపు పొందిన తాలిబన్ ప్రభుత్వం, ప్రస్తుతం పురుషుల స్వేచ్ఛను కూడా హరిస్తోందని అందులో వెల్లడైంది. 'సదాచార ప్రచార, దురాచార నిరోధ మంత్రిత్వ శాఖ' పేరుతో నిర్వహిస్తున్న మోరల్ పోలీసింగ్ ప్రభావం సామాజికంగా కీలకమైన వృత్తులపైనా పడుతోంది. ఆధునిక శైలిలో జుట్టు కత్తిరించుకునే యువకులు, అలాగే అలా కత్తిరించే క్షురకులు ఈ మంత్రిత్వ శాఖ అధికారుల లక్ష్యంగా మారుతున్నారు. వీరిని అరెస్టు చేయడం అనేక సంఘటనల్లో చోటుచేసుకుంది.

వివరాలు 

3,300 మందిని ఇన్‌స్పెక్టర్లు

గత ఆగస్టులో ఈ శాఖ ప్రత్యేకంగా ఓ నిబంధనల జాబితా విడుదల చేసింది. ఇందులో బస్సులు,రైళ్లలో పురుషులు ఎలా ప్రవర్తించాలి,సంగీత వినోదం,పండుగల సందర్భంగా జరుపుకునే ఉత్సవాలపై ఆంక్షలు విధించారు. మహిళలు బహిరంగంగా ముఖాన్ని చూపకూడదనీ, బిగ్గరగా మాట్లాడకూడదనీ స్పష్టంగా ఆదేశించారు. ఈ నియమావళి అమలును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం సుమారు 3,300 మందిని ఇన్‌స్పెక్టర్లుగా నియమించింది. గత ఆరు నెలల్లో అరెస్టయిన వారి కింద సగం మంది పురుషులు గడ్డాన్ని నిర్ణీత రీతిలో కత్తిరించకపోవడం లేదా క్షవరం చేయించకపోవడం వల్లే.

వివరాలు 

140 కోట్ల డాలర్ల మేర ఆర్థిక నష్టం

అలాగే, రంజాన్ మాసంలో పద్దతిగా నమాజ్ చేయని వారిని కూడా నిర్బంధించిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక మహిళల విద్య, ఉపాధి అవకాశాలను పూర్తిగా నిరోధించడం వల్ల దేశ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈ కారణంగా అఫ్గానిస్థాన్‌కు సంవత్సరానికి సుమారు 140 కోట్ల డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతోందని ఆ నివేదిక వివరించింది.