
India-Pak Tensions: ఐక్యరాజ్యసమితిలో భారత్-పాక్ ఉద్రిక్తతలపై కీలక చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది.
భద్రతా మండలి (UNSC)లో భారత్,పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రధాన అంశంగా చర్చకు రానున్నాయి.
ఈ సందర్భంగా రెండు దేశాలకు తమ అభిప్రాయాలు అంతర్జాతీయ వేదికపై వినిపించుకునే అవకాశం లభించనుంది.
గత ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గాం పట్టణానికి సమీపంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.
భారత్ ఈ దాడికి పాకిస్తానే బాధ్యత వహించిందని నిశ్చయించి,ఆ దేశంపై వివిధరకాల ఆంక్షలు విధిస్తూ తీవ్రంగా స్పందిస్తోంది.
ఇది పాకిస్తాన్‌ను తీవ్ర అసంతృప్తికి గురిచేయగా,అది ప్రతిస్పందనగా కౌంటర్ ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది.
వివరాలు
సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. అక్రమంగా వ్యవహరిస్తున్న భారత్
ముఖ్యంగా, భారత్ సింధు నదీ జలాల సరఫరాను నిలిపివేయడాన్ని పాకిస్తాన్ నేరుగా "యుద్ధ చర్య"గా అభివర్ణిస్తోంది.
ఈ నేపథ్యంలో,ఆదివారం పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందిస్తూ,భారత్ తమపై దాడి యత్నాలతో పాటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించారు.
సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అక్రమంగా భారత్ వ్యవహరిస్తోందని,ఈ విషయాలన్నింటినీ భద్రతా మండలిలో తమ దేశం బలంగా ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నారు.
ఇంకొకవైపు,భద్రతా మండలి ఇప్పటికే పహల్గాం ఘటనను ఖండించిన సంగతి తెలిసిందే.
సోమవారం జరగనున్న సమావేశానికి ముందు మండలిలోని పలువురు ప్రతినిధులు ఇరు దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతలపై స్పందించారు.
ఉగ్రవాదానికి ఏ రూపంలోనైనా తాము వ్యతిరేకమని, అదే సమయంలో ఆ ప్రాంతంలో నెలకొన్న పెరుగుతున్న ఉద్రిక్తతలు ఆందోళనకు గురిచేస్తున్నాయని మండలి అభిప్రాయపడింది.