US Bans Indian Companies: రష్యా మద్దతు ఇచ్చిన 15 భారతీయ కంపెనీలపై అమెరికా చర్యలు
రష్యా సైనిక-పారిశ్రామిక స్థావరానికి మద్దతు అందిస్తున్నారని ఆరోపిస్తూ 15 భారతీయ కంపెనీలతో సహా 275 వ్యక్తులు, ఆ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ వ్యవహారంలో చైనా, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్, టర్కీ దేశాలకు చెందిన కంపెనీలు కూడా రష్యాకు అత్యాధునిక సాంకేతికత, పరికరాలను సరఫరా చేసినందుకు నిషేధించారు. ఈ నిర్ణయం, రష్యా తన యుద్ధ యంత్రాంగానికి మద్దతు ఇస్తున్న కంపెనీలపై ఉన్న నిషేధంతో సంబంధించింది. యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా రహస్యంగా నడుస్తున్న నెట్‌వర్క్‌ను బలహీనపరిచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. రష్యా సైనిక పారిశ్రామిక అవసరాలను తీర్చడంలో సహాయపడే కంపెనీలతో వ్యాపారం చేయకూడదని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.
రక్షణ సంస్థలపై కూడా అమెరికా ఆంక్షలు
యూఎస్ ట్రెజరీ డిప్యూటీ సెక్రటరీ వాలీ అడెయెమో మాట్లాడుతూ ఉక్రెయిన్‌పై రష్యా చట్టవిరుద్ధమైన, అనైతిక యుద్ధానికి అవసరమైన పరికరాలు, సాంకేతికతను విచ్ఛిన్నం చేయడానికి యునైటెడ్ స్టేట్స్, మిత్రదేశాలు చర్య తీసుకుంటున్నాయని తెలిపారు. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ కూడా అనేక థర్డ్ పార్టీ దేశాలలో ఆంక్షల ఎగవేత, మోసాలను లక్ష్యంగా చేసుకుంది. రష్యా భవిష్యత్తు ఇంధన ఉత్పత్తి, ఎగుమతులకు మద్దతు ఇచ్చే అనేక సీనియర్ రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులకు, రక్షణ సంస్థలపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది.