US military: సిరియాలో ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడి.. 37 మంది ఉగ్రవాదుల మృతి
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. ఇక సిరియాలో అమెరికా బలగాలు ఉగ్రవాదులపై విరుచుకుపడ్డాయి. ఈ వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. వీరంతా ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్), అల్-ఖైదా అనుబంధ సంస్థలకు చెందినవారని, మృతుల్లో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు వెల్లడించింది.
900 మంది భద్రతా సిబ్బందిని మోహరించిన అమెరికా
అల్-ఖైదా అనుబంధ 'హుర్రాస్ అల్-దీన్ గ్రూప్'కు చెందిన సీనియర్ ఉగ్రవాది వాయువ్య సిరియాలోని దాడుల్లో హతమయ్యాడు. అతని సైనిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. సిరియాలోని ఐసిస్ శిక్షణ స్థావరంపై భారీ వైమానిక దాడి చేసి, 28 మంది ఉగ్రవాదులను అంతమొందించినట్లు వెల్లడించింది. తాజా దాడులతో ఐసిస్ శక్తిసామర్థ్యాలు దెబ్బతిన్నాయని, తమకు విఘాతం కలిగించే ఎటువంటి చర్యలని సహించమని అమెరికా స్పష్టం చేసింది. సిరియాలో ఐసిస్ పునరుద్ధరణను అడ్డుకోవడం కోసం సుమారు 900 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు వెల్లడించింది.