Page Loader
USA: రష్యాతో వ్యాపారం చేస్తే.. భారత్, చైనాలపై 500% సుంకం: అమెరికా హెచ్చరిక
రష్యాతో వ్యాపారం చేస్తే.. భారత్, చైనాలపై 500% సుంకం: అమెరికా హెచ్చరిక

USA: రష్యాతో వ్యాపారం చేస్తే.. భారత్, చైనాలపై 500% సుంకం: అమెరికా హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2025
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తే భారత్‌, చైనా లాంటి దేశాలపై భారీగా.. ఏకంగా 500 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు అమెరికా హెచ్చరించింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతుగా ఉన్న యూఎస్‌ సెనేట్‌ సభ్యులు త్వరలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ప్రముఖ సెనేటర్‌ లిండ్సే గ్రాహం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూనే ఉక్రెయిన్‌కు సహాయం చేయని దేశాలపై 500 శాతం దిగుమతి సుంకం విధిస్తాం.ఈ దేశాల ఉత్పత్తులపై ఆ ప్రభావం పడుతుంది. ఆ దేశం నుంచి చమురును భారత్, చైనాలు 70శాతం కొనుగోలు చేస్తున్నాయి' అని లిండ్సే పేర్కొన్నారు.

వివరాలు 

రష్యా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి 

ఈ చర్యల ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తీసుకురావాలనే అమెరికా యత్నం స్పష్టమవుతోంది. రాబోయే ఆగస్టు నెలలో ఈ బిల్లును అధికారికంగా ప్రవేశపెట్టే అవకాశముందని గ్రాహం పేర్కొన్నారు. ట్రంప్‌ ఈ బిల్లుకు తన మద్దతు ప్రకటించారని కూడా తెలిపారు. ఇది అమలులోకి వస్తే,రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్‌, చైనా వంటి దేశాలపై తీవ్రమైన ఆర్థిక ప్రభావం పడనుంది. ఈ ప్రభావం కేవలం చమురు దిగుమతుల వరకే పరిమితమవకుండా,భారత్‌ వంటి దేశాల నుంచి అమెరికాకు పంపే ఔషధాలు, వస్త్ర ఉత్పత్తుల వంటి ఇతర ఎగుమతులపైనా పడే అవకాశముంది. అదే సమయంలో,ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచిన దేశాల పట్ల సానుకూలంగా వ్యవహరించేందుకు మరో ఒప్పందాన్ని లిండ్సే గ్రాహం ప్రతిపాదించనున్నట్టు సమాచారం.

వివరాలు 

తక్కువ సుంకాలతో భారత్‌తో డీల్‌.. 

ఇక మరోవైపు, భారత్‌తో త్వరలోనే కొత్త వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఈ ఒప్పందంలో చాలా తక్కువ దిగుమతి సుంకాలు ఉండేలా చూడనున్నట్లు పేర్కొన్నారు. ''భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. ఇది పూర్తిగా కొత్త డీల్‌ అవుతుంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం దీనిపై ఇంకా అంగీకారం తెలపలేదు. కానీ వాళ్లు ఒప్పుకుంటే తక్కువ సుంకాలతో ఈ ఒప్పందాన్ని తేల్చుతాం,'' అని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇరుదేశాలు జూలై 9లోపు ఈ ఒప్పందాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇప్పటికే చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే ఇది ముగిసే అవకాశముందని తెలుస్తోంది.