
USA-China: ఐరాసా వేదికగా అమెరికా,చైనాలు విమర్శ, ప్రతివిమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం వేడెక్కుతోంది.
ఇరు దేశాలు ఇప్పటికే ఒకదానిపై ఒకటి ప్రతీకార సుంకాలు విధిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, తాజాగా ఐక్యరాజ్య సమితి వేదికపై విమర్శలు, ప్రతివిమర్శలతో ఘర్షణ స్థాయికి చేరుకున్నాయి.
చైనా ప్రభుత్వం, అమెరికా సుంక విధానాన్ని తమపై ఒత్తిడి తేవాలనే ధోరణిగా విమర్శించగా, అమెరికా దీనికి బలమైన ప్రతిస్పందన ఇచ్చింది.
బుధవారం నాడు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నిర్వహించిన సమావేశంలో చైనా తరఫున రాయబారి ఫు కాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
మాపై విధిస్తున్న భారీ సుంకాలు నిజానికి బెదిరింపులకే నిదర్శనం: ఫు కాంగ్
ఆయన మాట్లాడుతూ, "అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని పాలన కాలంలో వాణిజ్య భాగస్వాములపై విధించిన సుంకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర భంగాన్ని కలిగించాయి. 'పరస్పర అనుభందం' పేరుతో అమెరికా టారిఫ్ విధానాన్ని అడ్డుగా వాడుతోంది. ఇతర దేశాలకు నష్టాన్ని కలిగిస్తూ, తమ స్వలాభం కోసం చర్యలు తీసుకుంటోంది. ఈ విధానం అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య నిబద్ధతలకు భంగం కలిగిస్తోంది. మేము అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలా? లేక అమెరికా విధించిన అన్యాయపూరితమైన నియమాలను అనుసరించాలా? మాపై విధిస్తున్న భారీ సుంకాలు నిజానికి బెదిరింపులకే నిదర్శనం. ఇలాంటి ఒత్తిళ్లు తగినవిగా కానవు," అని ఫు కాంగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాలు
చైనా ఎగుమతులపై 145శాతం మేరకు సుంకాలు
దీనికి స్పందనగా అమెరికా మిషన్ ప్రతినిధి టింగ్ వు చైనా వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చైనా అవాస్తవ వ్యాఖ్యలు చేస్తోందని,ప్రపంచం ఆ దేశ వ్యాఖ్యల కన్నా,వారు చేతల్లో చూపిస్తున్న వైఖరిని పరిశీలించాలని సూచించారు.
బీజింగ్ ఎంతో కాలంగా తాము అనుసరిస్తున్న ఏకపక్ష,అన్యాయ వాణిజ్య విధానాల వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే ట్రంప్ పరిపాలన సమయంలో ప్రపంచంలోని పలు దేశాలతో పాటు చైనాపై కూడా అమెరికా భారీ సుంకాలు విధించింది.
ప్రస్తుతం చైనా ఎగుమతులపై 145శాతం మేరకు సుంకాలు అమల్లో ఉన్నాయి.
దీనికి ప్రతిగా చైనా అమెరికా దిగుమతులపై 125శాతం టారిఫ్ విధించింది. ఈ పరస్పర చర్యల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది.