Strikes in Syria: సిరియాపై అమెరికా సైన్యం దాడి.. 37 మంది ఐఎస్ ఉగ్రవాదులు మృతి
లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్ వరుస దాడులు జరపడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ పరిణామాలు ప్రాంతీయ యుద్ధం విస్తరించే భయాలను పెంచుతున్నాయి. ఈ క్రమంలో, సిరియాలో అమెరికా సైన్యం వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్‌ఖైదా అనుబంధ సంస్థ హుర్రాస్ అల్-దీన్‌కు చెందిన 37 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, వారిలో ఇద్దరు కీలక నేతలు ఉన్నారని అమెరికా ప్రకటించింది.
ఐసిస్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై వైమానిక దాడులు
అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం, ఈ దాడులు వాయువ్య, సెంట్రల్ సిరియాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించారు. మంగళవారం, అల్‌ఖైదా అనుబంధ హుర్రాస్ అల్-దీన్‌కు చెందిన ఒక కీలక నేతతోపాటు మరో ఎనిమిది మందిని లక్ష్యంగా చేసుకుని వాయువ్య సిరియాపై దాడి చేశారు. ఈ నేత స్థానికంగా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఉగ్రవాద గ్రూప్, ఉగ్రవాద నిరోధక చర్యలను అడ్డుకోవడానికి కుట్రలు చేసిందని, దాడులను సమన్వయం చేసిందని తెలియజేసింది. ఇంతకుముందు మధ్య సిరియాలో ఐసిస్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై పెద్దఎత్తున వైమానిక దాడులు జరిపి, 28 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అమెరికా వెల్లడించింది. వీరిలో నలుగురు సిరియాకు చెందిన కీలక ఉగ్రవాదులు ఉన్నారని పేర్కొంది.
సిరియాలో దాదాపు 900 మంది అమెరికా భద్రతా సిబ్బంది
తాజా దాడులతో ఐసిస్ శక్తిసామర్థ్యాలు దెబ్బతిన్నాయని అమెరికా ప్రకటించింది. తమ ప్రయోజనాలకు, మిత్రదేశాలకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులు ఉపేక్షించబడబోరని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో, ఐసిస్ గ్రూప్ మళ్లీ విస్తరించకుండా అడ్డుకునేందుకు సిరియాలో దాదాపు 900 మంది అమెరికా భద్రతా సిబ్బంది మోహరించబడ్డారు. అమెరికా స్థానిక భాగస్వాములు అయిన కుర్దిష్ నాయకత్వంలోని సిరియన్ డెమొక్రాటిక్ ఫోర్స్‌తో కలిసి పనిచేస్తోంది. ఇరాన్ మద్దతున్న ఉగ్రవాద గ్రూపులు పనిచేస్తున్న వాయువ్య సిరియా, ఐరాన్, సిరియా, ఇరాక్ మధ్య కీలకంగా ఉంది, అందుకే ఈ ప్రాంతం అమెరికా దృష్టిలో ఉంది.